SABARIMALA: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి వర్గాలు సోమవారం వెల్లడించాయి.ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్రపతి ముర్ము కేరళలో పర్యటించనున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి కొట్టాయం చేరుకుంటారు. అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీన పంపా బేస్ క్యాంపుకు వెళ్లనున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకోనున్నారు.
అయితే, అందరి భక్తుల్లా రాష్ట్రపతి కొండపైకి వెళ్తారా.. లేక అత్యవసర అవసరాల కోసం ఉపయోగించే రహదారి ద్వారా ఆలయానికి చేరుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు. దీనిపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిర్ణయం తీసుకుంటుందని ట్రావెన్‌కోర్ దేవస్వం ప్రెసిడెంట్ ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము ఓ రికార్డు నెలకొల్పనున్నారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్‌గా ముర్ము నిలవనున్నారు.