Murmu: పాకిస్తాన్ వ్యాపింపజేస్తున్న తప్పుడు వార్తలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాధానంగా ఒక బలమైన సందేశం ఇచ్చారు. బుధవారం ఆమె హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో రాఫెల్ యుద్ధ విమానంలో 30 నిమిషాలపాటు విహరించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు భారత తొలి మహిళా రాఫెల్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఫోటో దిగిన ఆ దృశ్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ యుద్ధవిమానాన్ని కూల్చేశామని, ఆ విమానాన్ని నడిపిన శివాంగి సింగ్‌ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. ఆ సమయంలో భారత వాయుసేన స్పష్టంగా స్పందిస్తూ — “శివాంగి సింగ్ భారత్‌లో సురక్షితంగా ఉన్నారు, పాక్ ప్రచారం అసత్యం” అని తేల్చిచెప్పింది.
అయితే తాజాగా, శివాంగి సింగ్‌తో రాఫెల్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము ఆ దృశ్యాల ద్వారా పాక్ బూటకపు ప్రచారానికి చెక్ పెట్టినట్లైంది.
శివాంగి సింగ్ రాఫెల్ యుద్ధవిమానాన్ని నడిపిన భారత తొలి మహిళా పైలట్.ఆమె 1995 మార్చి 15న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించారు.తండ్రి హరిభూషణ్ సింగ్ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్, తల్లి ప్రియాంక సింగ్ గృహిణి.సాధారణ కుటుంబానికి చెందిన శివాంగి, మెకానికల్ ఇంజినీరింగ్‌లో బిటెక్ పూర్తిచేశారు.
బాల్యములో ఆమె గ్రామానికి ఒక రాజకీయ నాయకుడి హెలికాప్టర్ దిగిన ఘటన ఆమెను పైలట్ కావాలనే కలకు ప్రేరణనిచ్చింది.
నేటి రోజున శివాంగి సింగ్ భారత వాయుసేన గర్వకారణంగా నిలుస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆమె రాఫెల్‌లో చేసిన ఆ గగన విహారం — పాక్ తప్పుడు ప్రచారాలకు ఒక నిజమైన సమాధానం, భారత మహిళా శక్తికి ఒక ప్రతీకాత్మకవిజయ గాధగా నిలిచింది.

