Arvind Dharmapuri

Arvind Dharmapuri: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. గడ్డం పెంచితే సీఎం అవుతారా..?

Arvind Dharmapuri: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాస్త సైలెంట్ అయిందంటూ సాగుతున్న ప్రచారానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎక్కడా సైలెంట్ కాలేదని, గ్రౌండ్ లెవెల్‌లో తెరవెనుక పక్కా ప్లానింగ్‌తో పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ సునామీ రావడం ఖాయమని, ఎలాంటి పొత్తులు లేకుండానే బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీల మధ్య తెరచాటు పొత్తుల డ్రామా నడుస్తోందని, సీఎం రేవంత్ రెడ్డిని తప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ స్కెచ్ వేస్తోందని బాంబు పేల్చారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. రేవంత్‌ను తప్పించేందుకు కాంగ్రెస్-బీఆర్ఎస్ కుట్ర?
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయని అర్వింద్ తీవ్ర ఆరోపణలు చేశారు.. ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిర్చేందుకు తెరవెనుక చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల కలయికకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే అడ్డుగా ఉన్నారు. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి శాశ్వతంగా ఔట్ చేయాలని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్షల కోట్ల దోపిడీకి మళ్లీ ఓట్లేస్తారా?..
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి తప్ప దేనికీ పనికిరాలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు కాజేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ప్రజాధారణ కోల్పోయి సోషల్ మీడియాలో కోట్ల రూపాయలు పెట్టి పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్‌కు గడ్డం పెరుగుతుంది కానీ సీఎం కాలేరు.. అర్వింద్ మార్క్ సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డం పెంచుకోవడంపై అర్వింద్ వేసిన పంచ్‌లు రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతారని ఎవరో బాబా లేదా జ్యోతిష్యుడు చెబితేనే కేటీఆర్ ఇలా గడ్డం పెంచుకుంటున్నారేమో! గతంలో కేసీఆర్‌కు కూడా పాత సచివాలయానికి వెళ్తే అధికారం పోతుందని ఎవరో చెబితే.. వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెక్రటేరియట్ కట్టారు, అయినా చివరకు ఎన్నికల్లో ఓడిపోయి ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు” అని గుర్తుచేశారు.

ఉత్తమ్ గుర్తున్నారా?
ముఖ్యమంత్రి కావాలనే పిచ్చితో గడ్డాలు పెంచుకోవడం కేటీఆర్‌తో మొదలుకాలేదని, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చేదాకా గడ్డం తీయనని శపథం చేశారని అన్నారు. ఆయనకు గడ్డం విపరీతంగా పెరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ బలపడలేదు. ఇప్పుడు కేటీఆర్‌కు కూడా గడ్డం బాగా పెరుగుతుందేమో కానీ.. ఆయన జీవితంలో మళ్లీ సీఎం అయ్యే ఛాన్సే లేదు అంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్‌ను మేం గాయాబ్ చేస్తాం.. కాంగ్రెస్ దానంతట అదే మాయమవుతుంది!
రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎలా ఉండబోతోందో అర్వింద్ వివరించారు..  త్వరలోనే రాష్ట్రంలోని పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కాషాయమయం కాబోతున్నాయని.. ప్రజల పక్షాన బీజేపీ సంధించే నిలదీతలకు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు పారిపోవాల్సి వస్తుందన్నారు.
కనుమరుగయ్యే పార్టీలు..
వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పూర్తిగా ‘గాయాబ్’ (కనుమరుగు) చేస్తుందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. అంతర్గత కుమ్ములాటలు, ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీని ఎవరూ ఓడించాల్సిన పనే లేదని, దానంతట అదే రాష్ట్రం నుంచి కనుమరుగైపోతుందని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ గత అవినీతిని ఎండగడుతూ బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తోందని, 2028లో తెలంగాణ పీఠంపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అర్వింద్ పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *