Suicide:

Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య

Suicide: “ప్రేమించడం ముఖ్యం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని బాగా చూసుకుంటాడా లేదా అని తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదు” అంటూ తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో శనివారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది.

డీఎస్పీ జి. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శివశంకర్, పద్మజ ఒకే డిగ్రీ కాలేజీలో చదువుకునేవారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పద్మజ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. కానీ, పెద్దలను ఎదిరించి తను ప్రేమించిన వ్యక్తితోనే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని 2019లో పద్మజ పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా శివశంకర్ సరిగ్గా పనికి వెళ్లేవాడు కాదు. పద్మజ తల్లిదండ్రులు కూతురి బాధలు చూడలేక ప్రతి నెలా కొంత డబ్బు ఇచ్చేవారు. అయినప్పటికీ శివశంకర్ ఉద్యోగం చేయకుండా అప్పులు చేయడం మొదలుపెట్టాడు. వీరిద్దరికి తేజశ్రీ (7), లాస్య (4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ ప్రైవేట్ స్కూల్‌లో తేజశ్రీ రెండో తరగతి, లాస్య యూకేజీ చదువుతున్నారు.

ఘటన జరిగిన రోజు శివశంకర్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయం కావడంతో పిల్లలను స్కూల్ నుండి తీసుకువెళ్లాలని ఉపాధ్యాయులు ఫోన్ చేశారు. తాను ఇంటర్వ్యూలో ఉండటంతో తెలిసిన వారికి పిల్లలను ఇంటికి చేర్చమని శివశంకర్ చెప్పాడు. వారు పిల్లలను తీసుకువెళ్తుండగా, మార్గమధ్యలో తల్లి పద్మజ ఎదురై పిల్లలను తాను ఇంటికి తీసుకువెళ్లింది.

ఇంటికి వెళ్లిన పద్మజకు జీవితంపై విరక్తి కలిగింది. భర్త బాధ్యతారాహిత్యం, అప్పుల బాధతో ఆమె కుంగిపోయింది. తాను చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచించి, గుండెను రాయి చేసుకుని ఇద్దరు కూతుర్లకు ఉరివేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందే ఆమె ఒక లేఖ రాసింది. “నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు. కానీ, ఈసారైనా జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకో” అని ఆ లేఖలో పేర్కొంది.

శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన శివశంకర్ తలుపు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా.. భార్య, పిల్లలు విగతజీవులై వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తన కూతురు, మనవరాళ్ల మరణానికి కారణం శివశంకరేనని పద్మజ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *