Kamal Haasan: తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు విజయ్‌కి సంబంధించిన వివాదాలు ఉండగా, ఇప్పుడు కమల్ హాసన్ ఎలక్షన్ వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజలకి సేవ చేయాలని మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీని పెట్టిన కమల్ హాసన్.. ఎలక్షన్‌కి నెల రోజులు కూడా లేని టైమ్‌లో తన పార్టీ ఎలక్షన్‌లో పోటీ చేయడం లేదంటూ చెప్పారు. దీంతో పార్టీ శ్రేణులలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఎలక్షన్‌లో పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు పెట్టాలని, టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేతలు కమల్ హాసన్‌ని నిలదీస్తున్నారు.
కమల్ హాసన్ ప్రస్తుతం డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌తో కూటమిలో ఉన్నారు. దీంతో కనీసం 10 నుండి 15 స్థానాల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందని అనుకున్నారు. కానీ దానికి కూటమి ఒక షరతు పెట్టింది. ఇప్పటికే రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ఎక్కువ సీట్లు ఇవ్వలేమని స్టాలిన్ తెగేసి చెప్పారు. ఇక్కడే ఇంకో చిక్కు ఉంది.. ఇచ్చే ఈ స్థానాల్లో కూడా తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేయాలని చెప్పారు. సొంత పార్టీ గుర్తు కాకుండా డీఎంకే గుర్తుపై పోటీ చేయడానికి ఇష్టం లేని కమల్ హాసన్, ఈసారి ఎలక్షన్‌లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇది కమల్ హాసన్ త్యాగమని స్టాలిన్ అంటుంటే, పార్టీ మెంబర్స్ ఈ నిర్ణయం సరికాదు అంటున్నారు.
మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నుండి పోటీ చేయడానికి సుమారు 60 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ఒక్కొక్కరు రూ. 50 వేల వరకు డబ్బులు చెల్లించారు. ఇప్పుడు తమ తమ డబ్బులు ఇచ్చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కోయంబత్తూర్ సౌత్ వంటి బలమైన కేడర్ ఉన్న ప్రాంతాల్లోని నేతలు కమల్ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎలక్షన్‌లో పోటీ చేయకుండా పార్టీ పెట్టుకోవడం ఎందుకు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏప్రిల్ 23న తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. పోయిన నెల 30న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 7తో ముగియనుంది. ఎలక్షన్‌కి ఇంత తక్కువ సమయం ఉండటం, నామినేషన్ ప్రక్రియ మూడు రోజుల్లో ముగుస్తుండటంతో.. ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 2019 ఎలక్షన్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.. ఇప్పుడు ఏకంగా పోటీ చేయడం లేదు. తమిళనాడు ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పటి నుండి రోజుకో వార్త వస్తూ, తమిళనాడు ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి పెరుగుతుంది.
