Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. తనపై జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. “ఒకే విమానంలో కలిసి ప్రయాణించిన రోజు నుంచే ఈ కుట్రలకు తెరలేపారు” అని కవిత వ్యాఖ్యానించారు.
కవిత మాట్లాడుతూ, “తీహార్ జైలు నుంచి వచ్చాకా ప్రజాక్షేత్రంలో కష్టపడి పని చేశా. హాస్టల్స్, గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలపై గళం వినిపించా. బీసీ సంక్షేమం కోసం, మహిళలకు రూ.2500 సాయం కోసం ఉద్యమం చేశా. తెలంగాణ తల్లి స్వరూపం మార్చడాన్ని వ్యతిరేకించా. ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టా. భద్రాచలం గ్రామాల కోసం పోరాడా. సీఎం సొంత జిల్లాల్లో కూడా పర్యటించా. 47 నియోజకవర్గాల్లో గులాబీ కండువా కప్పుకొని పార్టీ కార్యకర్తలతో మాట్లాడా. ఇవన్నీ పార్టీ వ్యతిరేక చర్యలుగా ఎలా భావిస్తారు?” అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నా తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి నేర్చుకున్న సామాజిక తెలంగాణ స్ఫూర్తితోనే మాట్లాడుతున్నా. నా మాటల్ని వక్రీకరించి మట్టి కర్రలు వేస్తున్నారు. హరీష్, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? రామన్నా! నా గురించి అబద్ధాలు ప్రచారం జరుగుతున్నా ఒక్కసారి ఫోన్ చేసి అడగలేదేంటి? 103 రోజులైంది.. ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

