Mithun Reddy : ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఎంపీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలని సిట్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయవాదులు విచారణకు ఆటంకం కలిగించవద్దని స్పష్టీకరించింది. విచారణ సందర్భంగా అధికారులు చేయి చేసుకొని, దుర్భాషలాడే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఉన్న సీసీటీవీలో కనిపించేలా విచారణ జరపాలని అధికారులకు సూచిస్తూ.. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు రిజెక్ట్ చేసింది. కాగా.. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నేటి ఉదయం విచారణకు హాజరుకావాలంటూ ఏపీ సిట్ బృందం ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
అయితే సిట్ నోటీసులపై తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎంపీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో ఎంపీకి ఊరట లభించింది. మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చింది ఉన్నతన్యాయస్థానం. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇస్తూనే విచారణకు సహకరించాలని ఎంపీకి సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రేపు విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ బృందం నోటీసులు జారీ చేసింది.
న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని.. కానీ విచారణకు న్యాయవాదులు ఆటంకం కలిగించవద్దని తాజా ఉత్తర్వుల్లో ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది.ఇక ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు చేయగా.. కీలక సమాచారాలను సేకరించారు. అందులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ కనుసన్నుల్లోనే నడించిందని తేలింది. దీంతో కసిరెడ్డిని విచారించేందకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు సిట్ నోటీసులు పంపించింది. కానీ కసిరెడ్డి మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ రావడంతో కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. అలాగే ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాల్సిందిగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా సిట్ నోటీసులు పంపించింది. దీంతో రేపు ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను సిట్ అధికారులు విచారించనున్నారు. వీరి విచారణతో మద్యం కుంభకోణానికి సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి మరి.