Aishwarya Rai: ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎక్కడున్నా, ఏ వేదికపై మెరిసినా అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంటారు. తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఐశ్వర్య, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించారు. ఈ వేదికపై ఆమె తన సినీ కెరీర్, ‘మిస్ వరల్డ్’ ప్రయాణం గురించి మాట్లాడారు.
1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఐశ్వర్య అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడంపై ఆమె మాట్లాడుతూ.. “1994లో నేను మిస్ వరల్డ్ పోటీల్లో అనుకోకుండా పాల్గొన్నాను. నేను దీన్ని కేవలం అందాల పోటీగా భావించలేదు. కచ్చితంగా టైటిల్ నాకే రావాలని కూడా అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావించి ఆ పోటీల్లో భాగమయ్యాను అని తెలిపారు.
పోటీల సమయంలో భారతీయుల గురించి అంతర్జాతీయ సమాజానికి చాలా తక్కువగా తెలుసనే విషయం తనను ఆశ్చర్యపరిచిందని ఐశ్వర్య వెల్లడించారు. “ఆ సమయంలో భారతీయుల గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకే వేదికపై మన దేశం గొప్పతనాన్ని చెప్పాను. మన సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఆ వేదికను ఉపయోగించుకున్నాను” అని ఆమె వివరించారు.
Also Read: Ravi Teja: రవితేజ కొత్త సినిమాకు యూనిక్ టైటిల్?
మిస్ వరల్డ్ టైటిల్ గెలవడంతో తన జీవితమే పూర్తిగా మారిపోయిందని ఐశ్వర్య పేర్కొన్నారు. “టైటిల్ గెలవడంతో నా జీవితమే మారింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నా మొదటి సినిమా (తమిళంలో ‘ఇరువర్’) చేశాను. అదే సంవత్సరం బాలీవుడ్ నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా మంచి సినిమాల్లో అవకాశాలు రావడంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను” అని ఆమె తెలిపారు.
తన కెరీర్‌లో ‘దేవదాస్’ సినిమా ఒక మైలురాయిగా నిలిచిందని ఐశ్వర్య అభివర్ణించారు. “నా సినీ జీవితంలో ‘దేవదాస్’ సినిమా ఒక మైలురాయి. ఆ చిత్రం తర్వాత కథల ఎంపిక గురించి నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఒక నటిగా నా పరిధిని విస్తరించుకోవడానికి ఆ సినిమా చాలా ఉపయోగపడింది” అని ఆమె చెప్పుకొచ్చారు. తనను ఆదరిస్తున్న అభిమానులు, ప్రేక్షకులు అందరికీ ఐశ్వర్య కృతజ్ఞతలు తెలియజేశారు.
ఐశ్వర్య రాయ్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చారిత్రక చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2లో కనిపించారు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి భారీ విజయాన్ని సాధించింది.

