Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సినిమా టికెట్ ధరల విషయంలో ఒక సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్తులో సినిమా టికెట్ రేట్లను పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ సినిమా నిర్మాతలు లేదా దర్శకులు తమ దగ్గరకు వచ్చి అడగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
మాది ఇందిరమ్మ ప్రభుత్వం. మా నిర్ణయాలన్నీ పేద ప్రజల కోసమే ఉంటాయి, అని మంత్రి కోమటిరెడ్డి గట్టిగా ప్రకటించారు. సినిమా టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సినిమా చూడటానికి ఇబ్బంది పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే తక్కువ ధరలు ఉండాలని, అప్పుడే అందరికీ వినోదం అందుబాటులో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పెరుగుతున్న రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతూ, హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారు? అని మంత్రి ప్రశ్నించారు. భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చి, ఆ భారాన్ని సినిమా టికెట్ల రేట్ల రూపంలో పేదలపై మోపడం సరికాదని ఆయన అన్నారు.
గతంలో టికెట్ రేట్లు పెంచకుండా ఉండాలని ప్రభుత్వం భావించినా, ఈసారి మాత్రం కొంత ‘పొరపాటు’ జరిగిందని మంత్రి కోమటిరెడ్డి అంగీకరించారు. అయితే, ఇకపై మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని, సామాన్య ప్రజల పక్షానే తమ నిర్ణయాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో మరియు ప్రేక్షకులలో హాట్ టాపిక్‌గా మారాయి.
