Komatireddy: సంక్రాంతి పండుగ వేళ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) కిక్కిరిసిపోతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం సాఫీగా సాగేలా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ముఖ్యంగా హైవేపై అక్కడక్కడా జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పనులు జరుగుతున్న చోట యంత్రాలను పక్కకు తొలగించి, రోడ్డు వెడల్పుగా ఉండేలా చూశామని మంత్రి చెప్పారు. దీనివల్ల బాటిల్‌నెక్ సమస్య తగ్గి వాహనాలు వేగంగా కదిలే అవకాశం ఉంటుంది.
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు గంటల తరబడి వేచి ఉండటంపై మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ హైవే డైరెక్టర్‌తో మాట్లాడి, ఒకవేళ టోల్ గేట్ల వద్ద రద్దీ విపరీతంగా పెరిగితే.. వాహనాలను ఆపకుండా, టోల్ వసూలు చేయకుండానే పంపించేలా సూచించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం వృధా కాకుండా ఉంటుంది.
అంతేకాకుండా, ప్రయాణ మధ్యలో ఏదైనా వాహనం మొరాయించినా లేదా ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా హైవే పొడవునా క్రేన్లను అందుబాటులో ఉంచారు. రోడ్డుపై వాహనాలు ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా, ఆ క్రేన్ల సహాయంతో వెంటనే వాటిని తొలగిస్తారని మంత్రి వివరించారు. ప్రజలందరూ సురక్షితంగా పండుగ జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
