Megastar Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ ఈరోజు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ యాక్టింగ్, సరికొత్త మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. థియేటర్ల దగ్గర మెగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ఘన విజయం సాధించడంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.
తాను ప్రస్తుతం షూటింగ్ కోసం పొల్లాచిలో ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ సినిమా దగ్గరే ఉందని చిరంజీవి అన్నారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డాడో, ఎంత శ్రద్ధ పెట్టాడో తాను దగ్గరుండి చూశానని చెప్పారు. ఈ రోజు థియేటర్లలో ప్రేక్షకులకు వస్తున్న రెస్పాన్స్, వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే.. ఒక తండ్రిగా మాత్రమే కాకుండా, ఒక నటుడిగా కూడా చరణ్‌ను చూసి ఎంతో గర్వంగా ఉందంటూ మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు.
‘పెద్ది’ పాత్రలో రామ్ చరణ్ పూర్తిగా లీనమైపోయాడని, ప్రతి సీన్లోనూ అతడి కష్టం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయని చిరంజీవి కొనియాడారు. అంత కష్టపడ్డాడు కాబట్టే ఈరోజు ఇంతటి ఘన విజయం దక్కిందని అన్నారు. ఇంత అద్భుతమైన కథను రాసి, అంతే గొప్పగా స్క్రీన్ మీద చూపించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే తొలి సినిమానే ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారును కూడా అభినందించారు.
ఈ సినిమాలో నటించిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, అద్భుతమైన నటన కనబరిచిన జగపతి బాబుతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దివ్యేందు శర్మలకు చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే సినిమాకు ప్రాణం పోసిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కెమెరామెన్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కొల్లాల పనితీరును మెచ్చుకున్నారు. ‘పెద్ది’ సాధించిన ఈ భారీ విజయం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని, మరిన్ని రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026
