Karregutta: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్ట మావోయిస్టులపై భారత భద్రతా బలగాలు నిర్వహిస్తున్న భారీ సెర్చ్ ఆపరేషన్‌గా నిలిచింది. గత 16 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ తాజాగా కీలక మలుపు తిరిగింది. బుధవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటరులో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులను వెంటాడుతున్న వేళ, ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 250 IED బాంబులు గుర్తించి నిర్వీర్యం చేశారు. అంతేకాదు, మూడు కొండలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
వేసవి ఎండ, అధిక ఉక్కపోత, అడవుల్లో చీకటి, విషసర్పాలు, పీడకలు అన్నీ సైనికులను తలకిందులుగా చేసినా వారు వెనకడుగు వేయలేదు. డ్రోన్లు, శాటిలైట్ మ్యాప్స్, డిఫెన్స్ హెలికాప్టర్ల సహాయంతో భద్రతా బలగాలు ప్రతి అడుగు ముందుకు వేసాయి. మావోయిస్టులు వేసిన పాతరల వల్ల 15 పేలుడు ఘటనలు జరిగాయి, ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.
ఈ ఆపరేషన్‌ను సీఆర్పీఎఫ్ ఐజీ రాజేష్ అగర్వాల్, బస్తర్ ఐజీ సుందర్ రాజ్, ఛత్తీస్ ఘడ్ ADG వివేకంద సిన్హా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి అడుగు కీలకమైన నేపథ్యంలో, భద్రతా బలగాలకు ఉన్నతాధికారుల గైడెన్స్ అత్యంత అవసరంగా మారింది.
Also Read: Pakistan: భయపడుతున్న పాకిస్తాన్.. దాడులను ఆపండి అంటున్న ఖవాజా ఆసిఫ్
Karregutta: మావోయిస్టులు, కొంతమంది సంఘాలు, రాజకీయ పార్టీలు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నా, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది – చర్చలకంటే ముందుగా శాంతి పరిస్థితిని తెచ్చేందుకు చర్యలు అవసరం. దీని ప్రకారం ఆపరేషన్ “కగార్” మరింత దూకుడుతో కొనసాగనుంది.
ఈ ఆపరేషన్ ద్వారా భద్రతా బలగాలు దండకారణ్యంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిలదొక్కుకుంటున్నాయి. మిలటరీ, పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాల సమన్వయం ఈ విజయానికి కీలకం. మావోయిస్టులపై సాగుతున్న ఈ చర్యలు దేశ సురక్షిత భవిష్యత్తుకు కీలక మలుపుగా మారనున్నాయి.