Manish Sisodia: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన ఆరోపణలు చేశారు. తాను తీహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందని వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సిసోడియా మాట్లాడుతూ జైల్లో తన పరిస్థితి బీజేపీకి అర్థమైందని, తన భార్య అనారోగ్యం బారిన పడడం, కుమారుడు చదువుకుంటున్న నేపథ్యంలో తనను బీజేపీలో చేరేందుకు ప్రలోభ పెట్టారని ఆరోపించారు.
“ఆప్ కూటమిని విచ్ఛిన్నం చేస్తే, నిన్ను సీఎంగా చేస్తాం” అంటూ బీజేపీ నేతలు ప్రతిపాదన పెట్టారని అన్నారు. తాను అంగీకరించకుంటే సుదీర్ఘకాలం జైల్లో ఉండాలని బీజేపీ హెచ్చరించినట్లు సిసోడియా చెప్పారు.
“ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది” అని ఆరోపించారు. “పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజల అవసరాలకు బీజేపీ పట్టించుకోదు, కేవలం అధికారం కోసం మాత్రమే ఆరాటపడుతుంది” అని అన్నారు. తమ మాటలు వినకుంటే తప్పుడు కేసులతో జైలుకు పంపుతారని మండిపడ్డారు.
కాగా, 2023లో ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న అనంతరం, సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.
వచ్చే నెల 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సిసోడియా జాంగ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎన్నికల వేళ రాజకీయ వేడి మరింత పెంచే అవకాశం ఉంది.