Murder Mystery: గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలు తీసుకున్న మృత్యువు. ఎందుకు మరణించారో కూడా తెలియదు ఎవరికీ. పొద్దున తల్లి, భార్యని హత్య చేసిన మోహన్ అనే వ్యక్తి, సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రోజు తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో ఈ విషాద ఘటన జరిగింది. ఇప్పటికీ ఈ మరణాలకు గల కారణాలు తెలియకపోవడం మిస్టరీగా మారింది. మరణించిన కుటుంబం విషయానికి వస్తే.. మోహన్, తన భార్య హరిత(33), తన తల్లి(65), కుమారుడు కౌశిక్(14), కూతురు హరిణి(12).. మొత్తం 5 మంది ఉంటున్నారు. ఓ ప్రైవేట్ స్కూల్ లో కూతురు 7వ తరగతి, కుమారుడు 9వ తరగతి చదువుతున్నారు.
హత్యలతో మొదలైన మృత్యుఘోష
వెంకటకృష్ణపాలెం పంచాయతీ పరిధిలోని చాకలి వీధిలో నివసించే మోహన్, నారాయణవనంలో సిమెంట్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మోహన్ తన భార్య హరిత (33), తల్లి చంద్రకళ (65)లను చున్నీతో మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. షాప్ లో ఉన్న తన బావమరిదికి భోజనం తెస్తానని చెప్పి వెళ్లిన మోహన్, ఇంటికి వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎంతసేపటికీ మోహన్ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బావమరిది బాలకృష్ణ ఇంటికి వెళ్లి చూడగా, అక్కడ హరిత, చంద్రకళ విగతజీవులుగా పడి ఉన్నారు.
స్కూల్ నుంచి పిల్లలను తెచ్చి.. పట్టాలపైకి
హత్యలు చేసిన అనంతరం మోహన్ నేరుగా పుత్తూరులోని తన పిల్లలు చదువుతున్న ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లాడు. “మా మామ చనిపోయారు” అని అబద్ధం చెప్పి 9వ తరగతి చదువుతున్న కుమారుడు కౌశిక్ (14), 7వ తరగతి చదువుతున్న కుమార్తె హరిణి (12)లను తనతో పాటు బైక్‌పై తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు వారితో కలిసి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తిరిగిన మోహన్.. రాత్రి 7 గంటల సమయంలో వేపగుంట రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు.
చిన్నారుల పోరాటం వృథా
రైలు వస్తున్న శబ్దం వినబడగానే మోహన్ పట్టాలపై తల పెట్టాడు. తండ్రి చేస్తున్న పనిని చూసి భయాందోళన చెందిన పిల్లలు.. ఏడుస్తూ ఆయన్ను పక్కకు లాగేందుకు శతవిధాలా ప్రయత్నించారు. “నాన్న వద్దు.. చనిపోవద్దు” అంటూ ఆ చిన్నారులు ప్రాధేయపడినా మోహన్ వినలేదు. దురదృష్టవశాత్తూ, సుమారు 100 కి.మీ వేగంతో వచ్చిన ఎగ్మోర్ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ముగ్గురినీ బలితీసుకుంది. తండ్రి ప్రాణాలు కాపాడబోయి ఆ ఇద్దరు పసి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి.
కారణం తెలియని మిస్టరీ
ఈ సామూహిక మరణాలకు అసలు కారణమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మోహన్‌కు ఎలాంటి అప్పులు లేవని, పైగా బుధవారం ఉదయమే తన సోదరి అప్పులు తీర్చడానికి కొంత డబ్బును పంపించాడని బంధువులు చెబుతున్నారు. బయటకు ఎలాంటి గొడవలు కనిపించకపోవడంతో, ఆ కుటుంబంలో అంతర్గతంగా ఏం జరిగిందనేది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
ప్రస్తుతం నారాయణవనం పోలీసులు హత్యలపై, రైల్వే పోలీసులు తండ్రి-పిల్లల మరణంపై వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
