Kidnap: నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత చిక్యాల హరీశ్ కుమార్ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో మామడ మండలం పొనకల్ గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి హరీష్‌ను బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు.
డబ్బు డిమాండ్.. హైదరాబాదుకు తరలింపు
కిడ్నాపర్ల ముఠా హరీష్‌కు రూ. 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. హరీష్ కుమార్ స్నేహితులకు కాల్ చేసి కొంత డబ్బును ఏర్పాటుచేయమని కోరినట్టు తెలుస్తోంది. కారు హైదరాబాదుకు దూసుకుపోతుండగా, తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా పరిస్థితి మారింది.
తెలివిగా తప్పించుకున్న హరీశ్.. పోలీసుల సహాయం
తూప్రాన్ టోల్‌గేట్ వద్ద కారు కొద్దిసేపు ఆగిన సమయంలో, చాకచక్యంగా పరిస్థితిని ఉపయోగించుకున్న హరీష్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. వెంటనే తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై వివరాలను వెల్లడించారు. అనంతరం మామడ పోలీసులకు సమాచారం అందించబడింది.
ఇది కూడా చదవండి: Gaddar Film Awards: గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆసాంతం సందడిగా సాగిన ఫంక్షన్
కిడ్నాపర్లపై అనుమానాలు.. విచారణ కొనసాగుతోంది
ఈ ఘటనపై మామడ ఎస్సై అశోక్ మాట్లాడుతూ, “హరీష్ కుమార్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. విచారణ జరుగుతోంది. కిడ్నాప్ వెనుక ఎవరున్నారనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని తెలిపారు.
హరీష్ కాల్ ద్వారా ఆత్మవిశ్వాసం
“నేను సేఫ్‌గా ఉన్నాను, ఎవరూ ఆందోళన చెందవద్దు” అంటూ హరీష్ కుమార్ తన సన్నిహితులతో ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఈ కిడ్నాప్ వెనుక వ్యక్తిగత వైరం, ఆర్థిక లావాదేవీల కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

