Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ప్రక్షాళన వేగవంతమైంది. పార్టీ పదవుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్యాడర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభవార్త చెప్పారు. ఆదివారం ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో కలిసి డీసీసీ మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ కూర్పును వచ్చే నాలుగు రోజుల్లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లాల బాధ్యులను ఆదేశించారు.
ఈ నియామకాల ప్రక్రియ కేవలం జిల్లాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి వరకు వెళ్లనుంది. ఈనెల 15వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను కూడా పూర్తి చేయాలని గడువు విధించారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: Jana Nayagan: జన నాయకుడు’ ట్రైలర్‌లో ఏఐ (AI) లోగో.. నెటిజన్స్ ట్రోల్స్!
సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, కష్టపడే తత్వాన్ని ప్రాతిపదికన తీసుకుని ఈ కార్యవర్గాలను ఖరారు చేయనున్నారు. జనవరి 1 తర్వాత ఎప్పుడైనా జాబితా రావచ్చన్న సంకేతాలతో, జిల్లా నేతల్లో తమకు ఏ పదవి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
కేవలం పదవుల భర్తీ మాత్రమే కాకుండా, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా టీపీసీసీ చీఫ్ స్పష్టతనిచ్చారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అదేవిధంగా, ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. వరుసగా వస్తున్న ఈ కీలక నిర్ణయాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.
