Mahesh Kumar goud: మాజీ మంత్రి హరీశ్‌రావు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు ఏ క్షణంలోనైనా కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎవరికైనా సహజమేనని, అదే కోణంలో హరీశ్‌రావు వ్యవహారం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌కు నిజంగా భవిష్యత్తు ఉంటే కవిత ఎందుకు బయటకు వస్తారంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ తన వద్ద ఉన్న డబ్బుతో సోషల్ మీడియాను నిర్వహిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఎప్పటికీ అధికారం దక్కలేదని, వారు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యవహారాలపై కూడా మహేశ్ గౌడ్ స్పందించారు. కేబినెట్ ప్రక్షాళనపై చర్చలు జరుగుతున్నాయని, అయితే తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని, టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడంలోనే తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథం ఉందని ప్రశంసించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ సులువుగా గెలుస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
