Mahaa Vamsi Comment: సాధారణంగా ఒక ఎమ్మెల్యే పర్యటనకు వస్తున్నారంటేనే అధికారులు చేసే హంగామా మామూలుగా ఉండదు. కానీ, అక్రమంగా కాకినాడ పోర్టునుంచి బియ్యం తరలిపోతున్న పరిస్థితిలో.. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తే.. అధికారుల్లో కదలిక కనిపించలేదు. జిల్లా ఎస్పీ ఏవో కారణాలతో సెలవు తీసుకున్నారు. ఇక పోర్టులో అధికారులు పవన్ కళ్యాణ్ కు అసలు సహకరించని పరిస్థితి. ఇదంతా చూస్తుంటే అధికారుల్లో అలసత్వం ఏమేరకు పెరిగిపోయిందో స్పష్టంగా కనిపిస్తోంది.
Mahaa Vamsi Comment: టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దీని విషయంలో ఎన్నో ఆరోపణలు వచ్చినా పట్టించుకునే నాధుడు లేడు. పైగా ఈ దందాకు తెరవెనుక సహకారం అందించిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లయిస్ మినిష్టర్ నాదెండ్ల మనోహర్ గతంలో విదేశాలకు తరలించడానికి గొడౌన్స్ లో ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వయంగా పట్టుకున్నారు. అయినప్పటికీ బియ్యం అక్రమరవాణా ఆగలేదు. అధికారులు రైస్ మాఫియాతో కుమ్మక్కు కావడంతో యధేచ్చగా బియ్యం ఓడల్లో వెళ్ళిపోతోంది. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు.
Mahaa Vamsi Comment: కాకినాడ పోర్టులో అధికారులతో పట్టుబడ్డ బియ్యాన్ని పరిశిలించేందుకు వెళ్లారు. అక్కడ పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు.
Mahaa Vamsi Comment: పోర్టు నుంచి ఇష్టా రీతిన బియ్యం ఎగుమతి అయిపోతుంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం పై సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. పోర్టు అధికారుల తీరు పవన్ కళ్యాణ్ కు మరింత అసహనాన్ని కలిగించింది. పోర్టులో భద్రతా వ్యవహారాలు పవన్ కళ్యాణ్ లోపభూయిష్టంగా ఉన్న పరిస్థితిని స్వయంగా గమనించారు. పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు జరగాల్సిన పరిస్థితుల్లో స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సుదీర్ఘ తీరప్రాంతం కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. సముద్రం ద్వారా సంఘ విద్రోహ శక్తులు, కసబ్ లాంటి టెర్రరిస్టులు చొరబడితే పరిస్థితి ఏమిటని ఆయన పోర్ట్ అధికారులను ప్రశ్నించారు.
Mahaa Vamsi Comment: మొత్తంగా చూసుకుంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన చాలా ప్రశ్నలను లేవనెత్తింది. సముద్ర తీర భద్రతపై అనుమానాలు రేకెత్తించింది. టన్నుల కొద్దీ బియ్యం రవాణా అయిపోతుండడం.. పోర్టులలో అరకొర సిబ్బంది.. సిబ్బంది కూడా బాధ్యతా రాహిత్యంగా ఉండడం.. సాక్షాత్తు డిప్యూటీ సీఎం వచ్చినప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడం వంటివి క్షమార్హం కాదు. తీరప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలు వేగవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.