Mahaa News: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితుల వద్ద వామపక్ష నేతలు చేసిన చిల్లర రాజకీయాల గుట్టును ‘మహా న్యూస్’ (Mahaa News) ఛానల్ ఆధారాలతో సహా రట్టు చేసింది. ప్రమాదంలో గాయపడి కేజీహెచ్ (KGH) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను, మృతుల కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వచ్చే సమయానికి.. అక్కడ ఉద్రిక్తత సృష్టించేందుకు ఓ మీడియా ప్రతినిధి చేసిన కుట్రలు కెమెరాకు దొరికిపోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
బాధితులను రెచ్చగొడుతూ కెమెరాకు చిక్కిన రిపోర్టర్.
మంత్రి నారా లోకేష్ ఆసుపత్రికి చేరుకునే సరిగ్గా అదే సమయానికి అక్కడ హడావిడి సృష్టించాలని, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు చూపించాలని మీడియా ప్రతినిధి ప్లాన్ చేశారు. లోకేష్ లోపలికి వస్తున్న తరుణంలో బాధితులను, అక్కడ ఉన్న కొందరిని రెచ్చగొడుతూ, స్లోగన్లు (నినాదాలు) చేయాలంటూ సదరు రిపోర్టర్ చేతులతో సైగలు చేస్తూ మహా న్యూస్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. లోకేష్ రాకముందే అక్కడ కొందరితో ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేయిస్తూ హంగామా సృష్టించేందుకు ఓ మీడియా ప్రయత్నించింది.
మా ఇంట్లో మనుషులు చనిపోతే మీ చిల్లర రాజకీయాలా?” విరుచుకుపడ్డ బాధితులు!
వామపక్ష మీడియా చేస్తున్న ఈ రాజకీయ డ్రామాను గమనించిన మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక జనాలు సదరు రిపోర్టర్‌పై మరియు సాక్షి ప్రతినిధులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా ఇంట్లో మనుషులు మరణించి మేము పుట్టెడు దుఃఖంలో ఉంటే.. మీరు ఇక్కడికి వచ్చి మీ స్వార్థం కోసం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారా? కూటమి ప్రభుత్వం, మంత్రులు వచ్చి మమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇస్తుంటే.. మీరు మధ్యలో వచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేయమనడం ఎంతవరకు కరెక్ట్? మా శవాల మీద మీ రాజకీయాలు ఏంటి? ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు, స్థానికులు
ప్రభుత్వం తమకు అండగా ఉంటూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుంటే.. వామపక్ష మీడియా కావాలనే శవ రాజకీయాలు చేస్తూ ఇక్కడ ఘర్షణ వాతావరణం తీసుకురావాలని చూడటం తప్పు అని జనాలు గట్టిగా వాదించి, వారిని నిలదీశారు.
మహా న్యూస్ కథనంతో బట్టబయలు:
దురదృష్టకరమైన ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ విషాదాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనే వైఖరిని సాక్షి మీడియా ప్రదర్శించిందని మహా న్యూస్ విజువల్స్ ద్వారా ఎండగట్టింది. బాధితుల ముసుగులో కొందరిని ముందు పెట్టి మైకులు ఇచ్చి మాట్లాడించేందుకు సాక్షి చేసిన ప్రయత్నాలను చూసి కేజీహెచ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. బాధితులే స్వయంగా సాక్షి మీడియా తీరును తప్పుబడుతూ కెమెరాల ముందే తిప్పికొట్టడంతో సదరు మీడియా ఛానల్ డిఫెన్స్‌లో పడినట్లయింది.
