Congress Politics

Congress Politics: కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి ఇదే! |

Congress Politics: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కి బలమైన నేత కరువుయ్యారట. ప్రతి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రతికూల పలితాలు వస్తున్నా… ప్రస్తుతం అధికారంలో ఉన్నా… పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదట అక్కడి నేతలు. కొంత మంది మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ని వదిలి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నా, వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదట. తాము కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చామా అని చర్చించుకుంటున్నారట ఆ వలస నేతలు. తమ గోడును వినే నేత లేరని బహిరంగంగానే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని కూడా చర్చ సాగుతోందట.

కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో 3 లక్షల 50 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా ఎక్కువ అర్బన్ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి రాజకీయ సమీకరణాలు ఇతర నియోజకవర్గాలపై ప్రభావం చూపుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో చేరికలు పెద్దగా జరగలేదు. పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి  15 నెలలు గడుస్తున్నా, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు. అయితే 6 నెలల క్రితం 8 మంది తాజా మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే వారికి కూడా సరైన ప్రాధాన్యత దక్కలేదు. అంతేకాకుండా పాలక వర్గం ఉన్న సమయంలో ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. పార్టీ నేతలకు చెప్పినా, సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో తాజా మాజీ కార్పొరేటర్లు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. కాంగ్రెస్‌లో చేరినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయమని చర్చించుకుంటున్నారట.

ఇది కూడా చదవండి: Delhi High Court Judge: అంతా తూచ్.. ఆ జడ్జి ఇంట్లో డబ్బు దొరకలేదు!

ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ మూడో స్థానానికే పరిమితమైంది. తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకే భారీ మెజారిటీ వచ్చింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా కరీంనగర్‌లో పార్టీ మరింత బలోపేతం కావాలని మీడియా ముఖంగా మాట్లాడారు. ఇక్కడ మెజారిటీ ఓట్లు వస్తే.. తాను గెలిచే వాడినని చెప్పారు. సమన్వయ లోపం కూడా స్పష్టంగా ఉందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంపై దృష్టి పెడతానని కూడా అన్నారు. నరేందర్ రెడ్డి మాటలు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.

ALSO READ  Red Alert For Telangana: నేడు, రేపు రెడ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు మంత్రులు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు మంత్రి శ్రీధర్ బాబు కాగా మరొకరు పొన్నం ప్రభాకర్. అయితే ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఈ ఇద్దరు నేతలు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో, పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ఏమైనా పార్టీ పని ఉంటేనే ఈ ఇద్దరు మంత్రుల దగ్గరికి కరీంనగర్ నేతలు వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ 15 నెలల్లో కరీంనగర్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆగిపోయాయి. దీంతో సెకండ్ క్యాడర్ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇటు అభివృద్ధి పనులు జరగక, అటు పార్టీ సమన్వయ లోపంతో… కరీంనగర్ కాంగ్రెస్ అయోమయానికి గురవుతోంది. ఈ ఇద్దరు మంత్రులు తలుచుకుంటేనే ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుందని నేతలు చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *