KRM Cabinet Race: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది! మార్చి చివరో, ఏప్రిల్ తొలి వారమో అనుకున్న ఈ విస్తరణ ఇంకా ఆలస్యమవుతుండటంతో.. ఢిల్లీ అధిష్టానం నుంచి సంకేతాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇక్కడ మాత్రం మంత్రి పదవి కోసం ఆశావాహులు ఢిల్లీ దాకా పరుగులు పెడుతూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు రేసులో ముందున్నారు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో ఎన్ని భర్తీ అవుతాయి? సామాజిక సమీకరణాలు, సీనియారిటీ ఆధారంగా ఎవరికి అవకాశం దక్కుతుంది? ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏముందో తెలియాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతుందని అంతా భావించారు. అయితే ఇప్పటివరకు ఢిల్లీ ఏఐసీసీ వర్గాలు మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఢిల్లీ అధిష్టాన వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం అమాత్య పదవి ఆశిస్తున్న వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ కోవలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నట్లు సమాచారం. కవ్వంపల్లి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump Tariffs: పరస్పర పన్ను అంటే ఏమిటి? దీనివల్ల భారత్ ఎంత నష్టం జరుగుతుంది?
వృత్తిరీత్యా వైద్యుడైన కవ్వంపల్లి సత్యనారాయణ ఇదే నియోజకవర్గంలో రసమయి బాలకిషన్‌పై వరుసగా మూడు సార్లు పోటీ చేసి.. మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ నేత, అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై అలుపెరుగని పోరాటం చేశారు. చివరికి మొన్నటి ఎన్నికల్లో విజయం వరించింది. ఎస్సీ సామాజికవర్గం నుంచి తమకు మంత్రి వర్గంలో స్థానం కేటాయించాలని ఇద్దరు నేతలు కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరు ఢిల్లీ వెళ్లి ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు.
కాగా ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల అంశంతో పాటు ఎన్నికలకు ముందు ఆయా నేతలకు ఇచ్చిన వాగ్దానం మేరకు మంత్రి పదవులను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తమకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ఆ సామాజికవర్గ నేతలు కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ సామాజికవర్గం నుంచి రాష్ట్రంలో చాలామంది ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు సీనియారిటీ దృష్ట్యా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
కాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మదిలో ఏముందో ఎవరికి తెలియకపోయినా… జాప్యం జరుగుతున్న కొద్దీ ఆశావాహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పుడున్న ఆశవాహులే కాకుండా మరికొందరు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో అన్ని సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని ఎవరికి మంత్రి పదవి లభిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.