Viral News

Viral News: దిండులో 25 తులాల బంగారం.. కట్ చేసే చెత్తలో పడేసిన కుటుంబ సభ్యులు

Viral News: ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరి దృష్టి బంగారంపైనే ఉంటుంది, కానీ రోజురోజుకీ ధరలు మాత్రం పెరుగుతూ సామాన్యుడికి అందనంత దూరానికి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు తమకే తెలియకుండా 25 తులాల బంగారం పడేస్తే ఎలా ఉంటుంది? దిమ్మ తిరిగిపోతుంది! ఇలాంటి ఘటనే మధురైలో జరిగింది. పడేసిన బంగారం దొరికిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

మధురై కార్పొరేషన్‌లోని 75వ వార్డు పరిధిలోని సుందరరాజపురం న్యూ రైస్ మిల్ 2వ వీధి ప్రాంతంలో తంగం (52) అనే మహిళ కుటుంబంతో కలిసి ఉంటుంది. తనకి ఒక్క కూతురు ఉంది, ఆమె పెళ్లి జనవరిలో పెట్టుకున్నారు. ఈ సమయంలో బంగారం ఎక్కడ పడితే అక్కడ పెడితే పోతుంది అని తంగం తన పాత దిండులో 25 తులాల బంగారాన్ని దాచిపెట్టింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచింది. పెళ్లి తేదీ సమీపిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఇల్లు శుభ్రం చేసే పని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పాత బట్టలు, పనికిరాని సామానులు అన్నీ, వీటితోపాటు తంగం బంగారం దాచిన దిండు కూడా పడేయడానికి నిర్ణయించుకుని ఇంటికి సమీపంలో ఉన్న మున్సిపల్ చెత్త డబ్బాలో పడేశారు.

అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లవారుజాము కాగానే లేచిన తంగం బంగారం దాచిన దిండు కోసం వెళ్లి చూడగా, అక్కడ కనిపించలేదు. మర్చిపోయి ఎక్కడైనా పెట్టానేమో అనుకుని ఇల్లు మొత్తం వెతికి చూడగా ఎక్కడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులను అడిగింది. వాళ్లు చెప్పిన సమాధానం వినగానే ప్రపంచం గుండ్రంగా కళ్లముందు తిరిగినట్టు అనిపించింది ఒక్కసారి. దాని గురించి తెలుసుకుని ఇంటి దగ్గరే ఉన్న చెత్త డబ్బా దగ్గరికి వెళ్లి వెతకగా, అక్కడ దిండు కనిపించలేదు. అప్పటికే చెత్త శుభ్రం చేసే బండి వచ్చి తీసుకుని వెళ్లిపోయింది.

ఇది కూడా చదవండి: Actress Hema: రోజుకు 500 ఫోన్‌కాల్స్ వచ్చేవి: నటి హేమ ఆవేదన!

ఏడుస్తూ 75వ వార్డు హెల్త్ సూపర్‌వైజర్ మరుదు పాండియన్‌ను సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది. వెంటనే చెత్త డబ్బాలో చెత్తను సేకరించిన పారిశుధ్య కార్మికురాలు మీనాక్షికి ఆయన ఫోన్ చేసి అడిగారు. ఆమె “నాకు తెలియదు, అక్కడ ఏమీ లేదు” అని చెప్పగా, గట్టిగా ప్రశ్నించాడు. అప్పుడు తనే తీసినట్టు ఒప్పుకుంటూ జరిగిన విషయాన్ని చెప్పింది. తాను సేకరించిన చెత్తను వేరు చేస్తుండగా, అందులో ఆమెకి చిన్న దిండు కనిపించింది. దానిని బయటికి తీసి చూడగా అందులో బంగారం ఉందని చెప్పింది. చివరికి ఆమె ఆ నగలను తీసుకువచ్చి హెల్త్ సూపర్‌వైజర్ మరుదు పాండియన్‌కు ఇచ్చింది.

బంగారం చేతికి రావడంతో హెల్త్ సూపర్‌వైజర్ పాండియన్ వెంటనే బాధితురాలిని సంప్రదించి, ఆమెకి 25 తులాల బంగారాన్ని అందించారు. పోయినవి అనుకున్న నగలు దొరకడంతో తంగం ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. తాను జీవితాంతం కష్టపడిన డబ్బులతో ఈ బంగారాన్ని కొనుక్కున్నట్లు తెలిపింది. దానిని తిరిగి ఇచ్చిన సూపర్‌వైజర్‌కు, పారిశుధ్య కార్మికులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది. ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *