Liquor Ban: రోడ్డు ప్రమాదంలో ఆ ఊరి యువకుడి మృతితో అదే పల్లె ప్రజల్లో కనువిప్పు కలిగింది. అప్పటిదాకా రాని మార్పు మొదలైంది. మహిళలంతా జట్టుకట్టి, కొంగు నడుముకు చుట్టి ఐక్యమత్యం చాటారు. ఊరందరినీ చేరదీశారు. చైతన్యం తెచ్చారు. ఇక ఊరంతా చాటింపు వేశారు. మద్యం తాగడం వల్లే ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇక ఎవరికీ ఈ దుర్గతి పట్టొద్దంటే ఊరిలో మద్యమే ఉండొద్దు.. అని నిర్ణయించుకున్నారు.
Liquor Ban: అనుకున్నదే తడవుగా మద్యపాన నిషేధం అమలుకు శ్రీకారం చుట్టారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామం ఈ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. మరోవైపు పొగతాగడాన్ని కూడా నిషేధం విధించాలని నిర్ణయించింది. దీంతో ఊరిలో బెల్ట్ షాపులు ఉండొద్దని, దుకాణాల్లో సిగరేట్లు, బీడీలు, గుట్కాలు అమ్మవద్దని ఊరంతా తీర్మానించుకున్నారు. బుధవారం ఈ తీర్మానం చేయగా, గురువారం (ఫిబ్రవరి 13) గ్రామంలో మహిళలు ర్యాలీగా బయలుదేరి గ్రామస్థుల్లో చైతన్యం తెచ్చారు.
Liquor Ban: ఈ నెల 5వ తేదీన ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యంతాగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ఈ నెల 10న మృతిచెందాడు. ఈ ఘటన ఆ ఊరి ప్రజలను కలిచివేసింది. మహిళల్లో కన్నీటివరద పారింది. ఇలాంటి దుర్గతి మరే ఇంటిలోనూ కలగొద్దంటే ఏంజేయాలో ఆలోచించారు. ఒక్కటిగా కూర్చొని ముచ్చటించారు. మద్యపాన నిషేధం అమలే మందు అని భావించి ఈ నిర్ణయానికి వచ్చారు.
Liquor Ban: బెల్ట్ షాపు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా, గ్రామంలో తాగిన వారికి రూ.20 వేల జరిమానా విధిస్తూ ఏపూరు గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. మందుబాబులను, మద్యం దుకాణం నడిపేవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా కూడా ప్రకటించారు. గ్రామంలో బెల్ట్‌షాపులు లేకుండా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకున్నారు. ఒకవేళ పట్టించుకోకుంటే ఏకంగా పోలీస్‌స్టేషన్‌నే ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.
Liquor Ban: ఒకచిన్న ప్రమాదం ఆ ఊరి జనంలో మార్పునకు కారణమైంది. ఈ చైతన్యం అన్నిగ్రామాల్లో రగిలి, ఊరూరా మద్యపాన నిషేధం అమలు జరిగితే ప్రమాదాలు నివారించడంతోపాటు శారీరక, మానసిక ఆందోళన నుంచి ఎందరో బయటపడే అవకాశం ఉటుంది. మరి ఊరూరా ఈ చైతన్యం కలగాలని కోరుకుందాం.