Dilip Doshi: భారత క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. టీమిండియా మాజీ స్పిన్నర్, సీనియర్ క్రికెటర్ దిలీప్ దోషి (77) సోమవారం లండన్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
దిలీప్ దోషి 1947 డిసెంబర్ 22న రాజ్‌కోట్‌లో జన్మించారు. ఆయన అద్భుతమైన ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్‌కు పేరుగాంచారు. 30 ఏళ్ల వయసులో, 1979 సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా, అనతికాలంలోనే తనదైన ముద్ర వేశారు. 1979 నుంచి 1983 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
దిలీప్ దోషి తన అంతర్జాతీయ కెరీర్‌లో 33 టెస్టు మ్యాచ్‌లు, 15 వన్డేలు ఆడారు. టెస్టు క్రికెట్‌లో 30.71 సగటుతో 114 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఆరు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. వన్డేల్లో 22 వికెట్లు తీశారు. 1981లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్రాత్మక టెస్టు విజయంలో దిలీప్ దోషి ఐదు వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశీయ క్రికెట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, 238 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 898 వికెట్లను పడగొట్టడం విశేషం. సుదీర్ఘకాలం పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్ జట్లకు కూడా ఆడారు.
Also Read: Rohit Sharma: “టాస్ దగ్గర ఏం తీసుకోవాలో మర్చిపోయాను!”
Dilip Doshi: మైదానంలో ఆయన చూపిన నైపుణ్యం, పట్టుదలకే కాకుండా, మైదానం వెలుపల ఆయన ప్రదర్శించిన సౌమ్యత, వినయం, క్రీడాస్ఫూర్తికి కూడా దిలీప్ దోషిని క్రికెట్ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన తర్వాత దిలీప్ దోషి లండన్‌లోనే స్థిరపడ్డారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్, కుమార్తె విశాఖ ఉన్నారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
క్రికెట్ ప్రపంచ సంతాపం:
దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “మాజీ భారత స్పిన్నర్ దిలీప్ దోషి లండన్‌లో మరణించడం చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని బీసీసీఐ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది. నేడు లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు దిలీప్ దోషి మృతికి సంతాపంగా బ్లాక్ బ్యాండ్‌లు చేతికి కట్టుకుని మైదానంలోకి రానున్నారు. భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పలువురు మాజీ, ప్రస్తుత క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.