Singeetham Srinivasa Rao: సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక ప్రయోగం చేయాలంటే, కొత్త రకం కథను చెప్పాలంటే యువ దర్శకులు కూడా వందసార్లు ఆలోచిస్తారు. ‘జనాలు ఇది చూస్తారా?’ అని భయపడతారు. కానీ, 94 ఏళ్ల వయసులో ఒక మహానుభావుడు, భారతీయ సినిమా ‘విజనరీ ఆర్కిటెక్ట్’గా పేరుగాంచిన సింగీతం శ్రీనివాసరావు మాత్రం ఇంకా కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు.
ఆయనకు కాలంతో పనే లేదు. నాలుగు దశాబ్దాల క్రితం మనసులో మెదిలిన ఒక వినూత్నమైన ఆలోచనను, నేడు ‘సింగ్ గీతం’ (Sing Geetham) అనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ 94 ఏళ్ల వయసులో కూడా “ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్” అని నిరూపిస్తూ, సాంకేతికంగా, వైవిధ్యంగా సినిమాను ముందుకు నడిపించిన ‘సినిమా ప్రయోగశాల’గా సింగీతం ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారనేది వాస్తవం.
ఐదు దశాబ్దాల సాహసం – అన్నీ ప్రయోగాలే!..
సింగీతం శ్రీనివాసరావు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అంటూ ప్రతి భాషలో తన ప్రమేయం కనబరిచారు. ముఖ్యంగా 50 ఏళ్ల సినిమా జీవితంలో ఆయన చేసింది 61 సినిమాలే అయినా.. ఆ 61 సినిమాలలో కూడా వినూత్నమైన కథలతో ప్రేక్షకుడి నాడీ పట్టుకొని అత్యద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. సినిమా దర్శకులంతా ప్రేక్షకులకు అనుగుణంగా సినిమాలు తీస్తూ పోతుంటే.. కాలానికి ఎదురొడ్డి వినూత్నమైన విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఘనత ఆయనది.
-
ప్రయోగాల రారాజు: కమర్షియల్ మూసను బద్దలు కొట్టిన ఈ లెజెండరీ దర్శకుడు, ఒక మూకీ డ్రామా నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. జానపద చిత్రాల నుండి మ్యూజికల్ ఫాంటసీల వరకు.. ఇలా వైవిద్య భరితమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
-
ఆ ఐకానిక్ సినిమాలు:
-
పుష్పక విమానం: మాటల్లేకుండా, కేవలం హావభావాలు, నేపథ్య సంగీతంతోనే నడిపించిన పూర్తి నిశ్శబ్ద చిత్రం. భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ సినిమాతో తొలిసారి డైలాగ్ లెస్ మూవీని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
-
ఆదిత్య 369: తెలుగు సినీ చరిత్రలో తొలిసారి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్. ఇలాంటి టైం ట్రావెల్ మూవీతో తొలిసారి ఇండస్ట్రీలో సైన్స్ ఫిక్షన్ మూవీలకు తెర లేపారు.
-
భైరవద్వీపం: అద్భుతమైన జానపద దృశ్యకావ్యం. ఇలాంటి సరికొత్త ప్రయోగాలు చేయడానికి మొగ్గు చూపారు.
-
మయూరి: ఒక నాట్యగత్తె తన కాలు పోగొట్టుకుని, తిరిగి ఎలా విజయం సాధించింది అనే స్ఫూర్తిదాయక కథ. ఇలాంటి భిన్నమైన ఆలోచనలను జాతీయస్థాయిలో అవార్డుల కమిటీలు సరిగా గుర్తించలేకపోయాయి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
-
నాలుగు దశాబ్దాల క్రితం మొలకెత్తిన విత్తనం – అన్నీ పాటలే!..
ఈ రోజుల్లో సినిమాల్లో పాటలు తగ్గిపోతున్నాయి. కానీ సింగీతం మాత్రం మరో కొత్త ప్రయోగానికి తెరలేపారు. ఆయన మనసులో సుమారు నలభై ఏళ్ల క్రితం ఒక ప్రశ్న మొలకెత్తింది: “సినిమా అంటే మాటలే ఉండక్కర్లేదా? ‘పుష్పక విమానం’ లాగా మాటల్లేకుండా కథ చెప్పొచ్చని నిరూపించాం. మరి, సినిమా మొత్తం కేవలం పాటలతోనే ఎందుకు చెప్పకూడదు?”
-
కమల్ హాసన్‌తో చర్చల్లో మొలకెత్తిన ఐడియా: అప్పట్లో ఈ దర్శక దిగ్గజం, లెజెండరీ నటుడు కమల్ హాసన్‌తో కలిసి సినిమాలపై చర్చించేవారు. “సినిమాలో ఏమేం కొత్తవి చేయొచ్చు? పాత పద్ధతులను ఎలా బద్దలు కొట్టొచ్చు?” అని వాళ్లు ఆలోచించేవారు. అలా ‘పుష్పక విమానం’ ఐడియా వచ్చింది. అదే సమయంలో సినిమా మొత్తం పాటలతోనే తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా వచ్చింది.
-
మారిపోతున్న కాలం – సాంకేతికత: ఆ ఆలోచనను సింగీతం నాలుగు దశాబ్దాలుగా మనసులో మోస్తూనే ఉన్నారు. సాంకేతికత మారింది, ప్రేక్షకుల అభిరుచి మారింది, సినిమా ట్రెండ్లు మారాయి. అయినా ఆయన తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఆ ఓపికే నేడు ‘సింగ్ గీతం’గా రూపుదిద్దుకుంది.
-
నేటి ట్రెండ్‌కు వ్యతిరేకంగా: నేటి తరం సినిమాలు చాలా వేగంగా సాగుతాయి, పాటల నిడివి తగ్గుతోంది. కొన్ని సినిమాల్లో పాటలే ఉండవు. కానీ సింగీతం మాత్రం “అన్నీ పాటలే ఉండే సినిమా” తీయడానికి ధైర్యం చేశారు. ఇది ఒక పెద్ద సాహసం. ఇది కేవలం పాత రోజులను గుర్తు చేసుకోవడం కాదు.. ఆయనలో ఉన్న విప్లవాత్మక ఆలోచనా విధానానికి నిదర్శనం.
అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రేమే మిన్న – ‘సినిమా ప్రయోగశాల’..
నిజానికి ఆయనకు పద్మ (పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ) పురస్కారాలు లభించకపోవడం వెనుక నిర్దిష్టమైన అధికారిక కారణాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కొన్ని విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పద్మ అవార్డుల ఎంపికలో తరచుగా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులు, రాజకీయ మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది అనే మాట వినిపిస్తూనే ఉంటుంది.
అయితే సింగీతం శ్రీనివాసరావు వివాదాలకు దూరంగా ఉండటం, కేవలం తన కళకే పరిమితమవడం, సెల్ఫ్ ప్రజెంటేషన్ ఇష్టం లేకపోవడం వల్ల ఆయన తరఫున బలమైన ప్రతిపాదనలు జరగలేదనేది అందరి అభిప్రాయం. సింగీతం శ్రీనివాసరావు ఎప్పుడూ కూడా అవార్డుల కోసం ఆరాటపడలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లే తత్వమే ఆయనను పద్మ పురస్కారాలకు దూరం చేసిందేమో అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కానీ ప్రజల హృదయాలలో అసలైన స్థానాన్ని ఆయన దక్కించుకున్నారు. ఆయనకు పద్మ అవార్డులు వరించకపోయినా..
-
ఆయన చిత్రాలకు రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు (National Awards) లభించాయి.
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులు వరించాయి.
-
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది.
అధికారిక పద్మ పురస్కారాలు ఆయనను వరించకపోయినా.. భారతీయ సినిమాను సాంకేతికంగా, వైవిధ్యంగా ముందుకు నడిపిన ఒక అసలైన ‘సినిమా ప్రయోగశాల’గా, ప్రజల మనసుల్లో ఒక అరుదైన విజనరీగా సింగీతం శ్రీనివాసరావు స్థానం ఎప్పటికీ అజరామరం!
