KTR

KTR: పొంగులేటి ఆ మాటకు కట్టుబడి ఉండాలి.. మంత్రికి కేటీఆర్ సవాల్!

KTR: సవాళ్లు విసరడం, ఆ తర్వాత మాట తప్పి పారిపోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ ఓట్లు అడగదని.. అలాగే గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు అడగకూడదని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ సవాల్‌పై కేటీఆర్ గట్టిగా స్పందిస్తూ మంత్రికి ఘాటు కౌంటర్ ఇచ్చారు.

తమది ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పేదల సొంతింటి కలను కూడా నిజం చేశామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చినట్లుగా చిన్న డబ్బా ఇళ్లు కాకుండా, తాము అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే మళ్లీ ఓట్లు అడుగుతామని ఛాలెంజ్ చేసిన మంత్రి పొంగులేటికి, ఆ మాట మీద నిలబడే దమ్ముందా అని ప్రశ్నించారు. ఊరికే శపథాలు చేయడం కాదు.. చేతనైతే ఆ ఇళ్లు కట్టించి చూపించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ నగరంలోనే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేటీఆర్ సగర్వంగా ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.70 వేలు ఇచ్చి అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు కట్టిస్తే, తాము కట్టిన ఒక్కో డబుల్ బెడ్‌రూం ఇల్లు.. కాంగ్రెస్ కాలం నాటి 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానమని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీకెండ్ వస్తే చాలు పేదల ఇళ్లను కూలగొడుతూ వికృతానందం పొందుతోందని మండిపడ్డారు.

గడిచిన రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కొత్తగా కట్టిన ఇళ్లు ఎన్ని? కూలదోసిన ఇళ్లు ఎన్ని? అనే విషయాలపై అధికారిక నివేదిక విడుదల చేసే ధైర్యం ఉందా అని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎన్ని డ్రామాలు ఆడినా.. ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన 420 అబద్ధపు హామీలను తాము వదిలిపెట్టబోమని, ప్రజల ముందు ఎండగట్టి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *