KTR

KTR: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావులను ఉరి తీయాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తప్పులు చేస్తే ఉరి తీయాలని అంటే, మరి ఇన్నేళ్లు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్‌ను ఎన్నిసార్లు ఉరి తీయాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి కనీస పరిజ్ఞానం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ట్రిపుల్ ఐటీ (IIIT) కి, ఐఐటీ (IIT) కి మధ్య ఉన్న తేడా కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. కేవలం కూల్చడాలు, తిట్టడాలు తప్ప రేవంత్ రెడ్డికి పాలనపై అవగాహన లేదని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగితే, అక్కడ మృతదేహాలను కూడా బయటకు తీయలేనంత దారుణమైన స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు.

తిట్ల విషయంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యమంత్రికి ఒక భాషలోనే తిట్టడం వస్తుందేమో కానీ, తనకు మాత్రం నాలుగు భాషల్లో తిట్లు వచ్చని కేటీఆర్ అన్నారు. అయితే, తాము సంస్కారంతో మాట్లాడుతున్నామని, ఒకవేళ తాము కూడా తిట్టడం మొదలుపెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, గట్టిగా సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *