ktr

KTR: ముగ్గురు మొనగాళ్లు కాదు.. ముగ్గురు మోసగాళ్లు

KTR: ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం “బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్” అన్నట్లుగా మారిపోయింది. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా “సర్వభ్రష్ట ప్రభుత్వం” అని అభివర్ణించిన ఆయన, జిల్లా మంత్రులను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రాజెక్టుల నుంచి పనుల వరకు అన్నింటిలోనూ 30 శాతం కమిషన్లు దండుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. జిల్లాలో ప్రస్తుతం “30 శాతం ట్యాక్స్” రాజ్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో పంచిన గ్యారంటీ కార్డుల ప్రస్తావన తెస్తూ.. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: ACA Mentor Mithali Raj: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్

రెండేళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదని, ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులను ప్రజలు ఎక్కడ దాచుకోవాలని సూటిగా నిలదీశారు. జిల్లాలోని మంత్రులను “ముగ్గురు మొనగాళ్లు కాదు.. ముగ్గురు మోసగాళ్లు” అని అభివర్ణించిన కేటీఆర్, వారి పైన అసలైన “అలీ బాబా” ఉంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేటీఆర్ సోదాహరణంగా వివరించారు. కేసీఆర్ హయాంలో అప్పులు తెచ్చినా, వాటితో సీతారామ ప్రాజెక్టు వంటి అద్భుత కట్టడాలు నిర్మించి ఖమ్మం జిల్లాలోని 7.5 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించే ఆస్తులను సృష్టించారని గుర్తుచేశారు. కానీ ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు చేసిన ఒక్క మేలైనా ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, కేవలం వసూళ్లపైనే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మండిపడ్డారు.

ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ నిర్వహించిన భారీ రోడ్ షోకు బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు ప్రజలు పోటెత్తారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను కేటీఆర్ ఘనంగా సన్మానించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. కొత్తగూడెంలో జరగబోయే పార్టీ కార్యకర్తల సమావేశాన్ని సైతం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. కేటీఆర్ విమర్శలు, ఆరోపణలతో ఖమ్మం జిల్లాలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *