KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) మళ్లీ వార్తల్లో నిలిచారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏ1 నిందితుడిగా విచారణకు హాజరైన కేటీఆర్, తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నిజం తనవైపే ఉన్నదని, అవసరమైతే జైలుకెళ్లేందుకు కూడా తాను వెనకాడనని స్పష్టం చేశారు.
విచారణకు హాజరైన కేటీఆర్:
హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఇవాళ ఉదయం కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది రామచందర్ రావు కూడా ఉన్నారు. ఫార్ములా ఈ కారు రేసు ఏర్పాట్లలో అనుమతులు లేకుండానే ప్రభుత్వ నిధులు విదేశీ సంస్థకు చెల్లించారని ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించగా, మీడియా పెద్ద ఎత్తున తరలివచ్చింది.
నిజం నిలిచే రోజు వస్తుంది
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “వందసార్లు విచారణకు పిలిచినా వస్తాను. గతంలో కూడా తెలంగాణ కోసం జైలుకెళ్లాం. మళ్లీ వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు. చట్టాలు, కోర్టులపై నాకు పూర్తి గౌరవం ఉంది” అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Director Maruthi: అక్కడ మా నాన్న అరటిపండ్లు అమ్మేవాడు.. దర్శకుడు మారుతి ఎమోషనల్ పోస్ట్
రేవంత్‌పై విమర్శలు:
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్, “420 హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, నేడు ఒక్కదానికీ న్యాయం చేయలేదు. బీసీ ప్రజలు రేవంత్‌ను గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు చెప్పుకోదగ్గ పని ఒక్కటైనా చేశారా?” అంటూ రేవంత్‌ను నిలదీశారు.
బీఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామరక్ష
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఒక రక్షక శక్తిగా నిలుస్తుందని, గతంలో రాష్ట్రం కోసం బహుళ పోరాటాలు చేసిన ఘనత తమదేనని కేటీఆర్ గుర్తు చేశారు. “ఇవాళే కాదు.. ఎప్పుడూ తెలంగాణ తరఫున నిలుస్తాం. అవసరమైతే మళ్లీ జైలుకెళ్లి పోరాడతాం. బీఆర్ఎస్‌నే తెలంగాణకు శ్రీరామరక్షగా భావించే రోజులు రాబోతున్నాయి” అని ధీమా వ్యక్తం చేశారు.