KTR: గత పదేళ్లు అధికారాన్ని అద్భుతంగా నిర్వహించాం కానీ, పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంలో ఎక్కడో వెనుకబడ్డామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణ మరియు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అస్త్రాలు సంధించారు.
పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
ఎన్నికల ఫలితాలపై విశ్లేషిస్తూ.. “మనల్ని మనమే ఓడించుకున్నాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంత నష్టం జరిగిందని ఆయన అంగీకరించారు.
పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జనవరిలో నూతన కమిటీలను వేయనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు కేసీఆర్ మీద కోపం లేదని, కేవలం పార్టీ నిర్మాణంలో లోపాల వల్లే ఓడిపోయామని స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాల్సిందేనని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి: Chinmayi: హద్దులు దాటిన అభిమానులు.. సింగర్ చిన్మయి సీరియస్
స్పీకర్ తీరుపై ఎద్దేవా.. ఫిరాయింపులపై ఫైర్
పార్టీ ఫిరాయింపుల అంశంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు స్పీకర్‌కు కనిపించడం లేదు.. వినిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెబితే స్పీకర్ అది వింటున్నారు” అని విమర్శించారు.
ముఖ్యంగా సీనియర్ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తూ. పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి కూడా పార్టీ ఎందుకు మారారో అర్థం కావడం లేదు.. ఆయనకు సిగ్గులేదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కడియంకు కనీస కమిట్‌మెంట్ లేదని ధ్వజమెత్తారు.
న్యాయ పోరాటానికి సిద్ధం
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయం పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని కేటీఆర్ కొనియాడారు. ఎన్నికల వివాదాలపై వెనక్కి తగ్గేదే లేదని, కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గెలిచిన సర్పంచ్‌ల రక్షణ కోసం జిల్లాలో ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.
మూసీ సుందరీకరణపై స్పష్టత
మూసీ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ వైఖరిని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. “మూసీ సుందరీకరణకు మేం అడ్డుకాదు.. అసలు ఆ ఆలోచన బీఆర్ఎస్‌దే. ఎస్టీపీ (STP)ల నిర్మాణం పూర్తి చేస్తే మూసీ ప్రక్షాళన జరిగినట్లే. ఒకవేళ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేయకపోతే, మళ్ళీ మేం అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టి, కేడర్ అంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారం పోయినా ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, పోగొట్టుకున్న చోటే మళ్ళీ గెలుస్తామని ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
