KTR: రేవంత్ రెడ్డి “అపరిచితుడు” సినిమాలో రాము, రెమోలా మాట్లాడుతుర్రు..

KTR : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు వ్యతిరేకంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు పోరాటం చేసి, అనేక ఇబ్బందులను ఎదుర్కొని విజయం సాధించిందని గుర్తు చేశారు. ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తే అందరూ సంతోషిస్తారని, కానీ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడుల గురించి చెప్పడం అసత్యమని విమర్శించారు. గతంలోనూ ఇలాగే బోలెడంత హామీలు ఇచ్చారని, వాటిలో వాస్తవం లేదని అన్నారు. “నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్ హామీల్లో నిజం కూడా అంతే ఉంటుంద”ని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హోర్డింగ్స్ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేయడాన్ని తప్పుబడుతూ, “మా ఫొటోలతో మీకేం పని? మీ ఫొటోలు పెట్టుకోండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. హోర్డింగ్‌లో చెప్పిన పెట్టుబడులు వాస్తవంగా ఎప్పుడు వస్తాయో ప్రజలకు వివరించాలని సూచించారు.

రైతు భరోసాపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. ఒకే ప్రసంగంలో రెండు వేర్వేరు తేదీలను చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి “అపరిచితుడు” సినిమాలో రాము, రెమోలా ఉన్నట్లు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల మాటలకు నమ్మకం లేదని, ఇవన్నీ కేవలం ఓట్ల కోసం అంటున్నారని ఆరోపించారు.

“మీరు నిజంగా ప్రజల కోసం పనిచేస్తే, ప్రజలు మీ పట్ల నమ్మకంతో ఉంటారు. కానీ అసత్యాలతో ప్రజలను మోసగించలేరు” అని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *