KTR: కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు..

KTR:  ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నా, విచారణల పేరుతో బెదిరిస్తున్నా తాము వెనుకడుగు వేయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని, ఆ విధానాలను ఎప్పటికీ వ్యతిరేకిస్తామని అన్నారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ విజయాల కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు అటువంటి కుట్రలను అడ్డుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

2014 తర్వాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అధిక అభివృద్ధి చేపట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. పువ్వాడ అజయ్ ఓడిపోవడం బాధాకరమని, కానీ ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ తగ్గలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించిన కేటీఆర్, ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు. అయితే పార్టీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుందని, సమస్యలపై నిరంతరం పోరాడుతుందని అన్నారు.

ఇటీవల ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు పువ్వాడ అజయ్ సేవలు అందరికీ గుర్తొచ్చాయని, కానీ అధికారంలో ఉన్న మంత్రుల వల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం కలగలేదని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు నష్టపోయారనే అభిప్రాయం ఉందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన కేటీఆర్, తాను త్వరలో ఖమ్మం పర్యటనకు వస్తాననితెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *