Kollu ravindra: కల్తీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నాయకుడు జోగి రమేశ్‌ను పక్కా ఆధారాల ఆధారంగానే అరెస్టు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ నకిలీ మద్యం తయారీకి జోగి రమేశ్ కుట్ర పన్నారని ఆరోపించారు. అన్ని సేకరించిన తర్వాతే చట్టపరమైన చర్యలకి దిగామని వెల్లడించారు.
సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర… జోగి రమేశ్, నకిలీ మద్యం కేసులో మరో నిందితుడు జనార్దనరావు మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందేనని అన్నారు. జనార్దనరావు నేరుగా జోగి రమేశ్ ఇంటికి వెళ్లినట్లు ఉన్న సీసీటీవీ దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. బీసీల గురించి మాట్లాడే హక్కు జోగి రమేశ్‌కు లేదని విమర్శించారు.
ఈ దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రి హెచ్చరించారు. జోగి రమేశ్‌కు ఉద్దేశపూర్వకంగా సహకరించే పోలీసు అధికారులు ఉంటే, లేదా కేసును మళ్లించేందుకు ప్రయత్నిస్తే వారిపైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటున్నదని, నేరగాళ్లు ఎవ్వరైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

