KK Survey: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలకు మించి వాస్తవ ఎగ్జిట్‌పోల్ సర్వేను ప్రజల ముందుంచి సక్సెస్ రేట్ సాధించిన కేకే సర్వే సంస్థ.. మహారాష్ట్రలోనూ అదే సక్సెస్ రేట్‌ను నమోదు చేసుకున్నది. దేశంలోనే ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఒకటీ రెండు మినహా మహారాష్ట్రలో బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కేకే సర్వే సంస్థ కూడా అదే కూటమి వైపు మొగ్గు చూపింది. అయితే ఇతర సంస్థలు మ్యాజిక్ ఫిగర్ అయిన 146కు 10, 20 స్థానాలు, ఒకటి రెండు సంస్థలు మరో పదీ పరక స్థానాలు అధికంగా మహాయుతి కూటమి సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని తేల్చాయి.
KK Survey: కాంగ్రెస్ సారధ్యంలోని మహా వికాస్ అగాడీ కూటమి కూడా 100 సీట్లకు అటూ ఇటుగా సాధిస్తుందని అంచనా వేశాయి. దీంతో అగాడీ కూటమికి కూడా అధికారంపై ఆశలు కలిగాయి. ఈ దశలో బీజేపీ కూటమిలో ఆందోళన నెలకొన్నది. మ్యాజిక్ ఫిగర్‌కు కాస్తో, కూస్తో ఎక్కువ వచ్చినా ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైన అప్పుడే దృష్టి పెట్టింది. దీంతో బొటాబొటీ మెజారిటీ వస్తుందేమోనని మహాయుతి కూటమి నేతలు అనుకున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు అటూ ఇటుగా వస్తే చిన్న పార్టీల మద్దతు కూడగట్టాలనే యోచనలో ఎంవీఏ కూడా ఉన్నది.
KK Survey: ఈ దశలోనే హర్యానా ఎన్నికల్లో సర్వే అంచనా తలకిందులైనా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కేకే సర్వే సంస్థ ఎగ్జిట్‌పోల్ సర్వే నిర్వహించింది. అయితే ఈ సంస్థ సర్వేను ప్రముఖ మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, సామాన్య జనం కూడా ఎక్కువ శాతం నమ్మలేదు. అందుకే దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మిగతా ప్రముఖ సంస్థల సర్వేలనే ప్రముఖంగా వెల్లడి చేశాయి. వాటి సరసన కేకే సర్వే సంస్థ అంచనాలు ఇవ్వలేకపోయాయి.
KK Survey: మహారాష్ట్ర ఎన్నికలపై కేకే సర్వే చేసిన ఎగ్జిట్‌పోల్ సర్వే సరాసరి అంచనా వేసి సక్సెస్ రేట్ సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి 225 సీట్లను గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కేకే సర్వే ఢంకా భజాయించింది. అదే దశలో మహా వికాస్ అగాడీ కూటమి 56 స్థానాలకే పరిమితం అవుతుందని, ఇతరులు 7 సీట్లను కైవసం చేసుకుంటారని కేకే సర్వే సంస్థ అంచనా వేసింది.
KK Survey: ఇతర ప్రధాన సర్వే సంస్థల అంచనాను మించి కేకే సర్వే ప్రకారమే ఫలితాలు వెల్లడి కావడం విశేషం. మహాయుతి కూటమి 225 స్థానాల్లో గెలుస్తుందని కేకే సర్వే అంచనా వేయగా, ఫలితాల అనంతరం 233 సీట్లు ఆ కూటమి వశం అయ్యాయి. అంటే కేకే చెప్పినదాని కంటే 8 స్థానాలు అధికంగా వచ్చాయి. అదే విధంగా మహా వికాస్ అగాడీ కూటమికి 56 స్థానాలతో సరిపెట్టుకుటుందని కేకే సర్వేలో తేలగా, ఫలితాల అనంతరం కేవలం 49 స్థానాలకే దిగజారింది. అంటే కేకే చెప్పినట్టుగా ఏడు స్థానాలు తగ్గాయి.
KK Survey: ఎవరికీ అందని అంచనాలు వేసిన కేకే సర్వే సంస్థ సక్సెస్ రేట్ సాధించి అగ్రభాగాన నిలిచింది. ఇతర ప్రముఖ సంస్థల అంచనాలకు మించి ఫలితాలు రావడంతో కేకే సర్వేనే సరైన అంచనా వేసిందని తేలింది. దీంతో కేకే సర్వే సక్సెస్ రేట్ సాధించి మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఇదే కేకే సర్వే జార్ఖండ్‌పైనా చేసిన సర్వే మాత్రం తిరగబడింది. బొటాబొటీ మెజారిటీతో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆ సర్వేసంస్థ అంచనాలు తలకిందులై జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం గమనార్హం.