Hyderabad: తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) కీలక వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) బీర్ల ధరలను సవరించలేదని, దీనివల్ల పెద్ద మొత్తంలో నష్టాలు కలిగాయని సంస్థ పేర్కొంది. గత కొన్ని నెలలుగా నష్టాలను భరిస్తూ బీర్లను సరఫరా చేస్తున్నామని, కానీ ఈ పరిస్థితి కొనసాగడం అసాధ్యమని UBL స్పష్టం చేసింది.
TGBCL ను అనేక సార్లు ధరలు సవరించాలని కోరామని, కానీ స్పందన రాలేదని వివరించింది. అంతేకాకుండా, TGBCL చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు సంస్థపై భారంగా మారినట్లు UBL పేర్కొంది.
UBL వివరణలో, సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తక్కువ ధరలతో బీర్లను సరఫరా చేయడానికి కట్టుబడి ఉందని వెల్లడించింది. అయితే, బీర్ల ధరలో సుమారు 70 శాతం ప్రభుత్వ పన్నులే ఉన్నాయని పేర్కొంది. ధరల సవరణను మరింత ఆలస్యం చేయకుండా, సరైన నిర్ణయం తీసుకోవాలని TGBCL ను మరోసారి విజ్ఞప్తి చేసింది.
గత బుధవారం నుంచి రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిచిపోయింది. పెద్ద మొత్తంలో పెండింగ్ బిల్లులను చెల్లించడమే కాకుండా బీర్ల ధరలను కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ కింగ్ ఫిషర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత వేసవి కాలంలో కూడా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా తగ్గడంతో మద్యం దుకాణాల్లో “నో స్టాక్” బోర్డులు కనిపించిన విషయం తెలిసిందే.