IND vs SA 2nd ODI: భారత స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాతో రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 90 బంతుల్లోనే శతకం పూర్తి చేసి, టీమిండియాను భారీ స్కోరు దిశగా నడిపించాడు. కోహ్లీకి ఇది వరుసగా రెండో వన్డే సెంచరీ కావడం విశేషం.
కోహ్లీకి 53వ, రుతురాజ్‌కి తొలి శతకం
విరాట్ కోహ్లీ (100 నాటౌట్): కోహ్లీ తన కెరీర్లో ఇది 53వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో అతనికి ఇది 84వ సెంచరీ. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన కోహ్లీ.. గైక్వాడ్‌తో కలిసి సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ (105): యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తన కెరీర్లో తొలి వన్డే సెంచరీని నమోదు చేసి మెరిశాడు. కేవలం 77 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన గైక్వాడ్, 12 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి మార్కో యన్సెన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
Also Read: Rohit Sharma: చరిత్రకు 41 పరుగులు…మరో మైలురాయికి దగ్గరలో రోహిత్ శర్మ!
ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (22), రోహిత్ శర్మ (14) నిరాశపరిచినప్పటికీ, కోహ్లీ, గైక్వాడ్ అద్భుతమైన మూడో వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 195 పరుగుల భారీ పార్ట్‌నర్‌షిప్‌ను జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు.
సిరీస్ విజయంపై భారత్ గురి
ఈ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఈ రెండో వన్డేలో కూడా భారత్ విజయం సాధిస్తే, సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంటుంది.
38 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి భారత జట్టు 275 పరుగులు చేసింది. సెంచరీ పూర్తి చేసిన కోహ్లీతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. మార్కో జాన్సెన్ రెండు, బర్గర్ ఒక వికెట్ తీశారు. టీమిండియా 350 పరుగుల మార్క్‌ను కూడా దాటే అవకాశం కనిపిస్తోంది.

