Sarpanch Died

Sarpanch Died: అనారోగ్యంతో ఏకగ్రీవ సర్పంచ్ తులసీరామ్ కన్నుమూత

Sarpanch Died: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోటితండా గ్రామ పంచాయతీకి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ భూక్య తులసీరామ్ (45) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్థులందరూ కలిసి ఆయనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని అందరూ ఆశించిన తరుణంలో, ఆయన మరణం ఆ గ్రామంలో తీరని లోటును మిగిల్చింది.

తులసీరామ్ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అస్వస్థతకు గురయ్యారు. మొదట ఆయనను ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ఆసుపత్రిలో పోరాడుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇది కూడా చదవండి: Daily Water Intake by Age: పదే పదే దాహం వేస్తుందా.. వెంటనే డాక్టర్ ని కలవండి

చిన్న వయసులోనే, అది కూడా పదవి చేపట్టిన వెంటనే ఆయన మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తులసీరామ్‌కు భార్య, ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు.

ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న తులసీరామ్ మరణవార్త తెలియగానే వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బోటితండా గ్రామంతో పాటు మండలంలోని ఇతర సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు తులసీరామ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *