AP Liquor Scam

AP Liquor Scam: మద్యం కుంభకోణం: సీజ్ చేసిన నగదుపై కోర్టు కీలక నిర్ణయం!


AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో సీజ్ చేసిన రూ. 11 కోట్ల నగదును వెంటనే బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు గురువారం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులను ఆదేశించింది. విజయవాడలోని ఎస్‌బీఐ మాచవరం శాఖలో ఈ మొత్తాన్ని జమ చేయాలని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రూ. 11 కోట్ల నగదు సీజ్:

సిట్ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్, కాచారం ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో రూ. 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఎస్.ఐ.టి కార్యాలయానికి తరలించిన అధికారులు, దీనికి సంబంధించిన మెమోను గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. దర్యాప్తులో భాగంగా విచారించిన వరుణ్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నగదును కనుగొన్నట్లు తెలుస్తోంది.

ఈ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. వారి విచారణ ఆధారంగా బునేటి చాణక్య, వరుణ్, వినయ్ వంటి మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు.

Also Read: Nandamuri Balakrishna: పార్లమెంట్‌లో బాలకృష్ణ సైకిల్ రైడ్

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అధికార మార్పిడి జరగడంతో, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న కొందరు విదేశాలకు పారిపోయినట్లు సిట్ గుర్తించింది. వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న రూ. 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతుండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *