KCR: మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును బీఆర్ఎస్‌ను వీడిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కలిసినట్టు విశ్వసనీన సమాచారం. ఈ మేరకు ఆ ముగ్గురు మళ్లీ బీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖతను వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది.
KCR: ఇప్పటికే వివిధ స్థాయిల్లో కీలక నేతలను ప్రసన్నం చేసుకున్న ఆ ముగ్గురూ.. ఆఖరి దశలో కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారని తెలుస్తున్నది. కాంగ్రెస్ సర్కార్‌పై వ్యతిరేకత వస్తున్నదని, బీజేపీకి ఆశల్లేవని భావించిన ఆ ముగ్గురు.. బీఆర్ఎస్ పార్టీయే సరైనదని భావించినట్టు సమాచారం. ఇటీవలే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరికతోనే బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యేలంతా పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం జరిగింది.
KCR: ఈ నేపథ్యంలోనే జిల్లాల స్థాయి నుంచి ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ.. సరైన సమయంగా బీఆర్ఎస్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. అందుకే చివరాఖరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి ఆయనతో చేరికకు సంబంధించిన మంతనాలు జరిపినట్టు తెలిసింది.
KCR: కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ ముగ్గురు రేపో, మాపో బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ మేరకు వారి చేరికకు బీఆర్ఎస్ కీలక నేతలు ప్లాన్ సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
