Kcr: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో పాలమూరు జిల్లా వివక్షకు గురైందని, ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కేంద్రం, రాష్ట్రాల వైఖరి ద్రోహపూరితంగా ఉందని ఆయన ఆరోపించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 308 కిలోమీటర్ల పాటు కృష్ణా నది ప్రవహిస్తుందని, ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 TMCల నీళ్లు పాలమూరు జిల్లాకు రావాల్సి ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. అయితే ఏపీ విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చవద్దని SRC (శ్రీకృష్ణ కమిటీ) స్పష్టంగా చెప్పిందని, పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, గతంలోనే దీనికి నీటి కేటాయింపులు జరిగాయని కేసీఆర్ వివరించారు. ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.
పాలమూరు ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్ ట్రిబ్యునల్ స్వయంగా ప్రకటించిందని, సమైక్య పాలకులు నీటిని కేటాయించకపోయినా సుమోటోగా జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ నీళ్లు కేటాయించిందని కేసీఆర్ గుర్తు చేశారు. పాలమూరు ప్రజలకు న్యాయం జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

