Kavitha: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వంటి ఉద్యమకారుడిని ఉరితీయాలంటూ మాట్లాడటం ఏమాత్రం పద్ధతి కాదని ఆమె మండిపడ్డారు. ఇలాంటి మాటలు వింటుంటే తెలంగాణ వాదుల రక్తం మరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలిలో తన రాజీనామా అంశంపై చర్చించేందుకు వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
కృష్ణా నదీ జలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తప్పుబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి ముఖ్యమైన విషయాన్ని అనుభవం లేని నాయకుల చేతుల్లో పెట్టవద్దని ఆమె సూచించారు. అసెంబ్లీలో కేసీఆర్ స్వయంగా మాట్లాడి, ప్రభుత్వ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ముందుకు సాగాలంటే కేసీఆర్ కచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా పార్టీలో పదవుల కేటాయింపుపై కూడా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో కేవలం హడావుడి చేసే వారికే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ గళం విప్పాలని, అప్పుడే ప్రజలకు అసలు నిజాలు తెలుస్తాయని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
