Kavitha Devanapalli: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత కార్యాలయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇది మరో ముందడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అసమ్మతి జెండా ఎగురవేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది. ఆ తర్వాత సొంత ఎజెండాతో తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
Kavitha Devanapalli: ఇటీవలే ఆమె శాసనమండలిలో జరిగిన సమావేశాల్లో తన ఆఖరు ప్రసంగం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. భావోద్వేగంతో తన కుటుంబంపై, బీఆర్ఎస్ పార్టీపై ఆమె పలు ఆరోపణలు గుప్పించారు. తనది ఆస్తుల తగాదా కాదని, ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత చెప్పుకొచ్చారు. ఓ దశలో పదేండ్ల కేసీఆర్ పాలనపై దుర్భాషలు వాడటం కూడా చర్చనీయాంశమైంది. ఈ పదేండ్లలో ఏంపీకి కట్టలు కట్టారు.. అంటూ ఆమె ఏకంగా తండ్రి పాలనను ధిక్కరించడం తీవ్ర పరిణామంగా భావిస్తున్నారు.
Kavitha Devanapalli: ఇదే సమయంలో రెండు రోజులు గడవక ముందే తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆ కార్యాలయంలో కవిత కూర్చునే సీటు వెనుక గతంలో ఆమె తండ్రి కేసీఆర్ భారీ ఫొటో ఉండేది. శుక్రవారం (జనవరి 9న) అదే కార్యాలయం నుంచి కవిత ఫొటోలు బయటకొచ్చాయి. ఆ ఫొటోలో గతంలో ఉన్న కేసీఆర్ ఫొటో కనిపించ లేదు. దీంతో కేసీఆర్ నుంచి ఆమె మరింత దూరం జరిగారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Kavitha Devanapalli: తొలుత కల్వకుంట్ల అన్న ట్యాగ్‌ను తొలగించుకున్న కవిత.. కవిత దేవనపల్లి (తన అత్తగారి ఇంటిపేరు) పేరున కొనసాగుతూ వస్తున్నారు. ఇన్నాళ్లు ఆ పార్టీలో తన సోదరుడైన కేటీఆర్, బావ అయిన హరీశ్‌రావుపై ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన కవిత.. ఇటీవల కేసీఆర్ పాలనపైనా విమర్శల బాణం ఎక్కుపెట్టింది. తాజాగా ఏకంగా కేసీఆర్ ఫొటోనే తన కార్యాలయం నుంచి తొలగించింది. త్వరలో ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలకు ఈ పరిణామం బలం చేకూరుస్తుందని అంటున్నారు.
