Kavitha: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సొంత పార్టీ నేతలపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
‘ఆరడుగుల బుల్లెట్’తో ప్రమాదం
కవిత తన అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్ రావు కుట్ర చేశారని ఆరోపించారు. సిరిసిల్ల ఎన్నికల్లో కేటీఆర్‌కు వ్యతిరేకంగా హరీష్ రావు రూ. 60 లక్షలు పంపించారని కవిత అన్నారు. “నాకు ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ గాయం చేసింది. మీకు కూడా ఆరడుగుల బుల్లెట్‌తో ప్రమాదం ఉంది” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా హరీష్ రావును ఉద్దేశించినవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
వెన్నుపోటు రాజకీయాలు, పార్టీ వీడిన నేతలు
గతంలోనూ హరీష్ రావు పార్టీకి వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించారని కవిత ఆరోపించారు. కేటీఆర్‌ను బతిమిలాడుకుని ఆయన పార్టీలో ఉన్నారని చెప్పారు. హరీష్ రావు వల్లే ఈటల రాజేందర్, మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు లాంటి కీలక నాయకులు పార్టీని వీడారని కవిత పేర్కొన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి హరీష్ రావే కారణమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
హరీష్, సంతోష్‌పై మరిన్ని ఆరోపణలు
హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావుపైనా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. సంతోష్ రావుకు ధన దాహం ఎక్కువ అని, ఆయన నేరెళ్లలోని దళితులను ఇబ్బందిపెట్టారని కవిత ఆరోపించారు. హరీష్, సంతోష్ ఇద్దరూ కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని, వాళ్లిద్దరూ ‘మేకవన్నె పులులు’ అని తన తండ్రి కేసీఆర్ చెప్పారని కవిత వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న తీవ్రమైన అంతర్గత విభేదాలను సూచిస్తున్నాయి.