Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా సాగుతున్న అంతర్గత అధికార పోరు చివరకు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర నాయకత్వంలో చారిత్రాత్మక మార్పు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవగా, కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర పగ్గాలను డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డి.కె. శివకుమార్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
అయితే, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అకస్మాత్తుగా ముంబై వెళ్లడంతో.. ఈ అధికారిక రాజీనామా ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందనే దానిపై స్వల్ప అనిశ్చితి నెలకొన్నప్పటికీ, సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయానికే సమర్పించనున్నట్లు సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి.
రాహుల్ గాంధీ జోక్యంతో మెత్తబడ్డ సిద్ధరామయ్య!
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. 77 ఏళ్ల సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో డి.కె. శివకుమార్‌తో సహా కేబినెట్ సహచరులకు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయన తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది.
ఈ నాటకీయ పరిణామాలుజరిగే ఒక రోజు ముందే సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతోనే సిద్ధరామయ్య పక్కకు తప్పుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం. గతంలో కూడా ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత చెబితే తాను రాజీనామా చేస్తానని’ సిద్ధరామయ్య బహిరంగంగానే ప్రకటించారు. హైకమాండ్ ఆయనకు జాతీయ స్థాయిలో పెద్ద పదవితో పాటు రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
పార్టీకి ఇచ్చిన మాటకు కట్టుబడ్డా: సిద్ధరామయ్య
బుధవారం రోజంతా బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో చర్చించాలని వారు ఒత్తిడి తెచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అందుకు ఒప్పుకోలేదు.
సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.వి. దేశ్‌పాండే తెలిపిన వివరాల ప్రకారం.. పలువురు ఎమ్మెల్యేలు వద్దని వారించినా, తాను పార్టీ నాయకత్వానికి ముందే మాట ఇచ్చానని, దానికి కట్టుబడి రాజీనామా చేస్తున్నానని సిద్ధరామయ్య వారికి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల సమయంలోనే కుదిరిన రెండున్నరేళ్ల రొటేషన్ పద్ధతి ఒప్పందాన్ని గౌరవిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
ఒకవైపు సంబరాలు.. మరోవైపు తీవ్ర నిరసనలు!
ఈ నాయకత్వ మార్పు వార్త కర్ణాటక కాంగ్రెస్‌లో భిన్నమైన వాతావరణాన్ని సృష్టించింది:
-
డి.కె. క్యాంప్‌లో జోష్: డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారనే సంకేతాలతో బెంగళూరు, రామనగర పరిసర ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు అర్ధరాత్రి నుంచే భారీ ఎత్తున సంబరాలు మొదలుపెట్టారు.
-
సిద్ధరామయ్య అనుచరుల ఆగ్రహం: దీనికి భిన్నంగా, సిద్ధరామయ్యను మార్చాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన అభిమానులు, లాయలిస్టులు సీఎం నివాసం వెలుపల పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
-
వెనుకబడిన వర్గాల హెచ్చరిక: కాంగ్రెస్ వెలుపల కూడా ఈ మార్పుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘అహిందా’ (వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దళితులు) సామాజిక కూటమి మద్దతు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, సిద్ధరామయ్యను తొలగిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని వెనుకబడిన తరగతుల సంఘాల సమాఖ్య హెచ్చరించింది.
విధానసౌధలో భావోద్వేగ వీడ్కోలు.. బీజేపీ ఎద్దేవా!
బుధవారం విధానసౌధలో జరిగిన కొన్ని దృశ్యాలు ఈ ఊహాగానాలను మరింత నిజం చేశాయి. జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం, తన ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘కుల గణన నివేదిక’ను సిద్ధరామయ్య స్వీకరించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) మరియు సెక్రటేరియట్ సిబ్బంది సిద్ధరామయ్యకు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. అక్కడ వాతావరణం అంతా ఒక ఫేర్‌వెల్ మూమెంట్‌ను తలపించింది.
మరోవైపు, ఈ సంక్షోభంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. గత మూడేళ్లలో సిద్ధరామయ్య ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించడంలో విఫలమైందని కాంగ్రెస్ అధిష్టానమే నిర్ధారణకు వచ్చిందని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినప్పటికీ కర్ణాటకలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ఏది ఏమైనప్పటికీ, గురువారం ఉదయం సిఎల్పి (CLP) సమావేశం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత, కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డి.కె. శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం కానుంది.
