Crime News: కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల రక్షిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్ధరాజు అమానుషంగా హతమార్చాడు.
వివాహిత అయినా… వివాహేతర సంబంధం
పోలీసుల సమాచారం ప్రకారం, రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో ఇప్పటికే వివాహం జరిగింది. అయితే, ఆమెకు బిలికేరె గ్రామానికి చెందిన సిద్ధరాజుతో పరిచయం ఏర్పడి, అది తర్వాత వివాహేతర సంబంధంగా మారింది. ఈ అనుబంధమే చివరికి రక్షిత ప్రాణాలను బలి తీసుకుందని పోలీసులు తెలిపారు.
లాడ్జిలో క్రూర హత్య
ఘటన జరిగిన రోజున సిద్ధరాజు రక్షితను ముందుగా కప్పడి ఫీల్డ్‌కు రప్పించి, అనంతరం మైసూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నోటిలో జెలటిన్ స్టిక్ పెట్టి పేల్చి హత్య చేశాడు. గదిలో అకస్మాత్తుగా గట్టిగా పేలుడు శబ్దం రావడంతో మొదట అది మొబైల్ ఫోన్ పేలుడు అనుకున్నారు.
ఇది కూడా చదవండి: Crime News: భర్త కొత్త నాటకం.. మెట్ల మీద నుంచి పడిపోయిన భార్య.. చూస్తే మొత్తం బోకాలే
సిద్ధరాజు కూడా అదే నాటకం ఆడుతూ, “ఫోన్ పేలిపోయింది. శిథిలాలను కిటికీ నుంచి బయటకు విసిరేశాను” అంటూ హోటల్ సిబ్బందిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.
సిబ్బందికి అనుమానం – పోలీసుల దర్యాప్తు
హోటల్ సిబ్బంది బయట వెతికినప్పుడు ఎలాంటి శిథిలాలు కనబడలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రక్షితను సిద్ధరాజే జెలటిన్ స్టిక్ పేల్చి హతమార్చినట్లు తేలింది.
పోలీసుల చర్యలు
సిద్ధరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేరాన్ని ఒప్పుకున్నాడని అధికారులు వెల్లడించారు. నేరానికి వినియోగించిన పేలుడు పదార్థాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంత క్రూరమైన పద్ధతిలో హత్య చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

