Kandula Durgesh

Kandula Durgesh: ఏపీలో సినిమా టికెట్ ధరలపై కొత్త పాలసీ.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వ్యవహారానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతిసారి కొత్త సినిమా విడుదలైనప్పుడు రేట్లు పెంచడం, దానికోసం జీవోలు ఇవ్వడం వంటి ఇబ్బందులు లేకుండా ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకువస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం సచివాలయంలో సినిమా రంగ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన కీలక సమావేశంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, టికెట్ రేట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనివల్ల అటు నిర్మాతలకు, ఇటు సామాన్య ప్రేక్షకులకు కూడా అయోమయం నెలకొంటోంది. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా బడ్జెట్, అందులో నటించే నటీనటుల రెమ్యునరేషన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఒకే జీవో తీసుకువచ్చేలా కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచస్థాయికి చేరిందని, వేల కోట్ల పెట్టుబడులు ఉన్నందున పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు థియేటర్లకు రావడమే కష్టమవుతోందని, సినిమా చూడటానికి వెళ్తే అక్కడ పాప్‌కార్న్ కొనుక్కోవడం కూడా సామాన్యుడికి భారం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, అటు సినిమా పరిశ్రమకు నష్టం కలగకుండా, ఇటు ప్రేక్షకుల జేబుకు చిల్లు పడకుండా మధ్యేమార్గంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

త్వరలోనే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో మరోసారి సమావేశమై పూర్తిస్థాయిలో చర్చలు జరపనున్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తూనే, సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *