Kakani govardan: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనుచరుడిపై కేసు నమోదైన నేపథ్యంలో, పోలీసులు, రెవెన్యూ అధికారులకు వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదమైంది.
వివరాల్లోకి వెళితే…
కాకాణి అనుచరుడు వెంకటశేషయ్యపై ఇటీవల లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన భర్త చనిపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి, దీన్ని ఆసరాగా తీసుకొని చాలా కాలంగా తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు వెంకటశేషయ్యపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనను రిమాండ్‌కు తరలించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, కాకాణి పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. వారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవిలపై ప్రత్యేకంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిని శాశ్వతంగా విధుల్లో కొనసాగనీయకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాకాణి గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాలు, ప్రజాసంఘాల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఒక ప్రజాప్రతినిధి ఇలా అధికారులను హెచ్చరించడం అనైతికమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.