Kadiyam srihari: ఎమ్మెల్యే కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్ చేసారు.కవిత ఇప్పటికే జైలుకు వెళ్లింది, కేటీఆర్ కూడా రేపో మాపో అరెస్టు అవుతారని చెప్పారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామస్తులతో ముఖాముఖి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
“కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాల పాలనలో కొత్త రకమైన అవినీతిని ప్రవేశపెట్టింది” అని అన్నారు. “కేసీఆర్ బిడ్డ లిక్కర్ కుంభకోణంలో ఎంతకాలం తీహార్ జైల్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే” అని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్ళడం కచ్చితమే అని కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ మరియు హరీష్ రావు కూడా జైలుకు వెళ్లాల్సిందే” అని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం వివిధ అవినీతి కేసుల్లో ఇరుక్కుందని, “కొంతమంది జైలు ఊచలు లెక్కపెట్టి వస్తే మరికొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు” అని వెల్లడించారు.
అలాగే, 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న ఆస్తులు ఇప్పుడు ఉన్న ఆస్తుల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. “దళిత బందులో కమిషన్ తీసుకున్న వారు ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదం” అని కడియం శ్రీహరి చెప్పారు. “నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరం” అని దుయ్యబట్టారు.