Jemima Goldsmith: టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ (Elon Musk) ని Xలో ట్యాగ్ చేసి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ (Jemima Goldsmith) సంచలన బహిరంగ విజ్ఞప్తి చేశారు. జైలులో ఉన్న తన మాజీ భర్త ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి తాను ఎక్స్ (X) ప్లాట్‌ఫామ్‌లో పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు జెమీమా తన అధికారిక ఎక్స్ ఖాతాలో మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఒక భావోద్వేగపూరిత పోస్టు చేశారు.
మా ఆవేదన ఎక్స్ ద్వారానే చెప్పగలుగుతున్నాం
జెమీమా తన లేఖలో వ్యక్తిగత విజ్ఞప్తిని జోడించారు. ప్రియమైన ఎలన్ మస్క్‌కు ఒక వ్యక్తిగత విజ్ఞప్తి. నా మాజీ భర్త ఇమ్రాన్ చట్టవిరుద్ధంగా ఏకాంత నిర్బంధంలో ఉన్నారు. ముఖ్యంగా, నా ఇద్దరు కుమారులకు తమ తండ్రిని చూసేందుకు, మాట్లాడేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం ‘ఎక్స్’ ద్వారా మాత్రమే ఇమ్రాన్ ఖాన్ గురించి మా ఆవేదనను ప్రపంచానికి తెలియజేయగలుగుతున్నాం అని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kolkata: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ నిర్వాహకుడు అరెస్టు
అయితే, పాక్ అధికారులు ఇమ్రాన్‌పై అనుసరిస్తున్న కఠిన వైఖరి గురించి తాను పెడుతున్న పోస్టులకు ‘విజిబిలిటీ ఫిల్టరింగ్’ అడ్డుపడుతోందని జెమీమా ఆరోపించారు. ఈ ఫిల్టరింగ్ కారణంగా తన పోస్టులు బయటకు వెళ్లి ప్రజలకు చేరడం లేదని, దీనిపై వెంటనే దృష్టి సారించి తన ఎక్స్ ఖాతాలో ఆ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని ఆమె మస్క్‌ను కోరారు.
అడియాలా జైలులో ఇమ్రాన్ భద్రతపై ఆందోళన
ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైలులో ఉన్నారు. ఇటీవల, ఆయన మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. ఈ ప్రచారం ఇమ్రాన్ మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఆయనను కలిసేందుకు అవకాశమివ్వాలని మద్దతుదారులు నిరసనలు చేపట్టారు.
దీని తర్వాత, అధికారులు కేవలం ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖానుమ్‌కు మాత్రమే ఆయన్ను కలిసే అవకాశం కల్పించారు. అనంతరం ఖానుమ్ మాట్లాడుతూ, జైలులో ఇమ్రాన్ సురక్షితంగానే ఉన్నారని ప్రకటించడంతో ఉద్రిక్తత కొంత తగ్గింది.
జెమీమా గోల్డ్‌స్మిత్ విజ్ఞప్తిపై ఎలన్ మస్క్ లేదా ఎక్స్ ప్లాట్‌ఫామ్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో అనేది ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

