JC Prabhakar reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దారెడ్డి అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ఆరోపించారు. తనపై, తన కుమారుడు అశ్మిత్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు.
“ఇదే చివరి హెచ్చరిక”
తాడిపత్రిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ మాట్లాడుతూ – “130 రోజులు నన్ను, 75 రోజులు నా కుమారుడిని జైల్లో పెట్టించారు. అధికారంలో ఉన్నప్పుడు మనల్ని తిట్టిన వారు, ఇప్పుడు కాళ్లు పట్టుకుంటున్నారు. తాడిపత్రి ప్రజలే ఇప్పుడు పెద్దారెడ్డిని ఊర్లోకి రానివ్వడం లేదు” అని విమర్శించారు.
భూ అక్రమాలు, ఫ్రాడ్లు
పెద్దారెడ్డిపై పలు భూ అక్రమాల ఆరోపణలు చేస్తూ, తన ఇంటికి సంబంధించిన 6 సెంట్ల స్థలాన్ని కూడా మోసం చేసి రిజిస్టర్ చేయించారని, కోటమికుంట్లలో వందల ఎకరాలు కబ్జా చేశారని దుయ్యబట్టారు. సోలార్ ప్రాజెక్టుల పేరుతో భూములను కన్వర్షన్ చేసి అక్రమంగా పాసుపుస్తకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఆధారాలన్నీ త్వరలో బయట పెడతానని హెచ్చరించారు.
వ్యక్తిగత విమర్శలు
పెద్దారెడ్డి తనను “ముండమోపి” అని దూషించారని, తాను కూడా “డాంకీ”, “క్రాస్‌బ్రీడ్” అంటూ కౌంటర్ ఇచ్చారు. “ఇసుక అక్రమ రవాణా, సారా తయారీ వంటి అక్రమాలకే పెద్దారెడ్డి చాటుముట్టారు” అని ఆరోపించారు. “నాకు అలాంటి అవసరం లేదు, మీసం మెలేసి బతుకుతున్నా” అంటూ తాను నిజాయతీగా ఉన్నానని తెలిపారు.
రక్షణ లేకున్నా భయపడేది లేదంటూ ధైర్యం
“పెద్దారెడ్డి వద్ద ప్రైవేటు గన్‌మెన్‌లు ఉన్నారు, నాకు గన్‌మెన్ కూడా లేరు. అయినా ఏమీ చేయలేరు. తాడిపత్రి ప్రజలు నా వెంటే ఉన్నారు” అని జేసీ ధైర్యంగా వ్యాఖ్యానించారు. వైసీపీపై వ్యతిరేకత వ్యక్తం చేసిన జేసీ, “వైసీపీలో ఉన్నవారిలో చాలామంది నా అన్న దివాకర్ రెడ్డి శిష్యులే” అని గుర్తు చేశారు.